అంజన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం 10:30 గంటల నుండి 11:30 గంటల మధ్య ఆయన కొండగట్టు ఆలయానికి చేరుకుంటారు. గతంలో ఎన్నికల విజయం తర్వాత అంజన్నకు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన సమయంలో, భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలు, మండపాలు నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుండి మంజూరైన నిధులతో చేపట్టే పనులకు ఆయన ఈరోజు భూమి పూజ చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారం, పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ బోర్డు కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 35.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో కింద పేర్కొన్న సౌకర్యాలు కల్పించనున్నారు. ఒకేసారి సుమారు 2,000 మంది భక్తులు దీక్ష విరమించేలా అత్యాధునిక మండపం. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం 96 గదులతో కూడిన అతిథి గృహం. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆలయ కార్యక్రమం అనంతరం కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్ట్‌లో తెలంగాణ జనసేన నాయకులు మరియు కార్యకర్తలతో పవన్ సమావేశమవుతారు. ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లు, ఇతర ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 1,100 మంది పోలీసులతో కొండగట్టు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మరియు ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story