Pawan Kalyan Praises: డైరెక్టర్ క్రిష్ పై పవన్ ప్రశంసలు
పవన్ ప్రశంసలు

Pawan Kalyan Praises: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న సోమవారం నాడు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తన అభిమానులను, చిత్ర యూనిట్‌ను ఉద్దేశించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత సినిమా గురించి ఎమోషనల్ గా మాట్లాడారు. హరిహర వీరమల్లు సినిమాపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
హరిహర వీరమల్లు షూటింగ్ ఆలస్యం కావడానికి గల కారణాలను పవన్ వివరించారు. ముఖ్యంగా తన రాజకీయ ప్రయాణం, కోవిడ్ మహమ్మారి, తన వ్యక్తిగత కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చిందని చెప్పారు. ప్రేక్షకులను, అభిమానులను ఇంతకాలం వెయిట్ చేయించినందుకు క్షమాపణలు కోరారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడిపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. క్రిష్ విజన్‌కు, సినిమా పట్ల ఆయన నిబద్ధతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం క్రిష్ ఎంత కష్టపడ్డారని చెప్పారు.
హరిహర వీరమల్లులో తన పాత్ర ఛాలెంజింగ్‌గా ఉందని దీని కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నానని తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో ఒక మైలురాయి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంత భారీ బడ్జెట్‌తో ఎన్నో అడ్డంకులను అధిగమించి సినిమాను పూర్తి చేసినందుకు నిర్మాతలను అభినందించారు పవన్ .
తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణాన్ని కూడా ప్రస్తావించారు. సినిమా పరిశ్రమకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, రాజకీయాల వల్ల సినిమాకు సమయం కేటాయించలేకపోతున్నానని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే రాజకీయాల్లోకి వచ్చానని పునరుద్ఘాటించారు. సినిమా , రాజకీయాలను సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
తనను ఎప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న అభిమానులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వారి మద్దతు లేనిదే తాను ఏదీ సాధించలేనని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా జూలై 24, 2025న విడుదలవుతుందని ప్రేక్షకులందరూ థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించాలని కోరారు పవన్.
