Posani Krishna Murali Slams: తమిళనాడు రాజకీయాల్లో టీవీకే అధినేత, నటుడు విజయ్‌ చుట్టూ జరుగుతున్న పరిణామాలపై టాలీవుడ్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు విషయంలో విజయ్‌కు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయ కుట్ర జరుగుతోంది

ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించకుండా, ముందే మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ కోరడం పక్షపాతమేనని పోసాని విమర్శించారు. విజయ్‌ను అడ్డుకునేందుకు ఒక పక్కా ప్లాన్ ప్రకారం కుట్ర జరుగుతోందని, ఆయనను రాజకీయంగా ఒంటరిని చేసి అభిమన్యుడిని చేసే ప్రయత్నం చేస్తున్నారని పోసాని ఆరోపించారు. అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమని ఆయన మండిపడ్డారు.

విజయ్ వ్యక్తిత్వంపై పోసాని ప్రశంసలు

విజయ్‌తో తనకు ఉన్న పాత పరిచయాలను ఈ సందర్భంగా పోసాని గుర్తు చేసుకున్నారు. విజయ్, ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్‌తో తనకు దశాబ్దాల కాలంగా స్నేహం ఉందని తెలిపారు. విజయ్ ఎప్పుడూ పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని, ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎంతో సంయమనంతో, నిశ్శబ్దంగా ఎదుర్కొంటారని కొనియాడారు.

తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌కు లభించిన ప్రజాధరణను చూసి ఓర్వలేకనే ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని పోసాని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు ఇప్పుడు అటు తమిళనాడుతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి.

Next Story