Prakash Raj Makes Sensational Allegations: జాతీయ అవార్డులపై ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు
ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు

Prakash Raj Makes Sensational Allegations: నటుడు ప్రకాశ్ రాజ్ జాతీయ చలనచిత్ర అవార్డుల విధానంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ రాజీ పడుతోందని, కొన్ని సినిమాలకే దక్కుతున్నాయని ఆయన ఆరోపించారు. తాజాగా ఆయన కేరళ రాష్ట్ర ఫిల్మ్ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేరళ అవార్డుల ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ప్రకాశ్ రాజ్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే జాతీయ అవార్డుల విషయంలో అలా జరగడం లేదని ఆయన అన్నారు.
ప్రస్తుత విధానంపై అసంతృప్తిని తెలియజేస్తూ.. "మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం వంటి గొప్ప చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్ముట్టి లాంటి గొప్ప నటుడికి ఆ అవార్డులు అవసరం లేదు" అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే చలనచిత్ర పరిశ్రమకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. దర్శకులు, రచయితలు.. పెద్దలు, యువతతో పాటు పిల్లలను కూడా దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీయాలని.. పిల్లల కోసం మంచి చిత్రాలను రూపొందించాలని ఆయన కోరారు.

