President Draupadi Murmu Meets Comedian Brahma: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో హాస్య బ్రహ్మ భేటీ.. అద్భుత కానుక ఇచ్చిన బ్రహ్మానందం
అద్భుత కానుక ఇచ్చిన బ్రహ్మానందం

President Draupadi Murmu Meets Comedian Brahma: టాలీవుడ్ లెజెండరీ హాస్యనటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్రహ్మానందాన్ని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం తనలోని అద్భుతమైన చిత్రకళా నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారు. తాను స్వయంగా పెన్సిల్‌తో గీసిన ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. ఈ ప్రత్యేక కానుకను చూసి రాష్ట్రపతి ముగ్ధులయ్యారు. అనంతరం వీరిద్దరూ కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.
నటుడే కాదు.. గొప్ప చిత్రకారుడు
బ్రహ్మానందం కేవలం వెండితెరపై నవ్వులు పూయించడమే కాదు, ఆయనలో ఒక గొప్ప కళాకారుడు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఖాళీ సమయాల్లో పెన్సిల్ ఆర్ట్ ద్వారా దేవుళ్ల చిత్రాలను ఎంతో తన్మయత్వంతో గీస్తుంటారు. గతంలో ఆయన గీసిన చిత్రాలను దివంగత కృష్ణంరాజు నుంచి నేటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరకు ఎంతో మంది ప్రముఖులకు బహుమతిగా అందించారు. ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలికి తన కళాఖండాన్ని అందించడం ద్వారా తన వ్యక్తిత్వానికి మరో గౌరవ ఘట్టాన్ని జోడించుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. "ఒక గొప్ప నటుడు.. ఒక గొప్ప కళాకారుడు.. భారత రాష్ట్రపతిని కలవడం తెలుగు వారికి గర్వకారణం" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

