డిజిటల్ వినోద ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెరలేచింది. బాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ క్రియేటర్‌గా, అవినాష్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ 'ప్రీతమ్ & పెడ్రో' (Pritam and Pedro) ట్రైలర్ విడుదలైంది. అర్షద్ వార్సి, విక్రాంత్ మాస్సే, వీర్ హిరానీ, మోనా సింగ్, బోమన్ ఇరానీ వంటి హేమాహేమీలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్, రాబోయే జూలై 3న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో అలరించడానికి సిద్ధంగా ఉంది.

ఇటీవలే విడుదలైన ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో అనేక అంచనాలను, ప్రశ్నలను రేకెత్తించగా.. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ మాత్రం ఫుల్ లెంగ్త్ హ్యూమర్, మిస్టరీ, చేజింగ్, ముక్కోణపు డ్రామాతో అదరగొడుతోంది. రెండు భిన్నమైన ప్రపంచాలకు చెందిన వ్యక్తులు ఒకే చోట కలిస్తే ఎలాంటి వింత పరిస్థితులు ఎదురవుతాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సిరీస్‌ను రూపొందించారు.

కథేంటంటే?

గోవా అందాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఇద్దరు భిన్నమైన వ్యక్తులు అనుకోని పరిస్థితుల్లో ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరు పాత తరం ఆలోచనలతో, కేవలం తన ఇన్‌స్టింక్ట్ నమ్మి పనిచేసే సీనియర్ పోలీస్ ఆఫీసర్ పెడ్రో. మరొకరు టెక్నాలజీని నరనరాన జీర్ణించుకున్న షార్ప్ మైండెడ్ యంగ్ టెక్ జీనియస్ ప్రీతమ్.

ఈ ఇద్దరూ కలిసి తాము ఊహించిన దానికంటే చాలా పెద్దదైన, అత్యంత వింతైన ఒక మిస్టరీ కేసులోకి లాగబడతారు. వారి ప్రయాణం ముందుకు సాగుతున్న కొద్దీ రహస్యాలు విడిపోవడం, నమ్మకాలు దెబ్బతినడం, ప్రతి మలుపులోనూ ఊహించని నవ్వులు పూయించే గందరగోళం ఎదురవుతుంటాయి. పాత తరం పోలీస్ తెలివితేటలు, కొత్త తరం డిజిటల్ టెక్నాలజీతో ఎలా పోటీపడ్డాయి అనేదే ఈ సిరీస్ ప్రధాన ఇతివృత్తం.

ఓటీటీ ప్రపంచంలోకి రాజ్‌కుమార్

ఎమోషన్స్, హ్యూమ్యానిటీ, క్లీన్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఈ సిరీస్‌తో ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టడం విశేషం. ఆయన మార్క్ హ్యూమర్, ఎమోషన్స్ ఈ సిరీస్‌లో హైలైట్‌గా నిలవనున్నాయి. జియోహాట్‌స్టార్ హెడ్ (హిందీ & ఇంగ్లీష్ ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్) ఆలోక్ జైన్ మాట్లాడుతూ.. గొప్ప కథలు అనేవి కొద్దిమందికి మాత్రమే పరిమితం కాకూడదు. అవి దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరాలి. ఆ లక్ష్యంతోనే మేము కంటెంట్‌ను నిర్మిస్తున్నాము. ఆఫీస్ ప్రయాణాల్లో, సాయంత్రం విశ్రాంతి సమయంలో లేదా కుటుంబంతో కలిసి చూసేలా ఈ సిరీస్ ఉంటుంది. రాజ్‌కుమార్ హిరానీ వంటి అద్భుతమైన కథకుడు మా ప్లాట్‌ఫారమ్‌పైకి రావడం మాకు ఎంతో గర్వకారణం. 'ప్రీతమ్ & పెడ్రో' ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

చిత్ర యూనిట్ ఏమంటుందంటే?

క్రియేటర్ రాజ్‌కుమార్ హిరానీ:

"ఈ కథలో నన్ను బాగా ఆకర్షించింది ప్రీతమ్, పెడ్రోల మధ్య ఉండే సంబంధం. ఇద్దరి ప్రపంచాలు వేరు, ఆలోచనలు వేరు. కానీ ఇద్దరూ కలిసి ప్రయాణించాల్సి వస్తుంది. మనుషుల మధ్య ఉండే వైరుధ్యాలు, వింత బంధాలను వినోదాత్మకంగా చూపించడం నాకు ఇష్టం. ప్రేక్షకులు ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు."

దర్శకుడు అవినాష్ అరుణ్:

"ప్రతి సీన్‌లోనూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే శైలి ఈ సిరీస్‌లో ఉంటుంది. ఇది కేవలం కామెడీ, మిస్టరీ మాత్రమే కాదు.. మానవ సంబంధాల చుట్టూ తిరిగే కథ. ఇంత గొప్ప నటీనటులతో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం."

నటుడు అర్షద్ వార్సి (పెడ్రో):

"నా పాత్ర పెడ్రో.. జీవితాన్ని ఎక్కువగా ఆలోచించడు, మనసు చెప్పినట్లు వింటాడు. దానివల్ల లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ సిరీస్‌లో ఉన్న మ్యాడ్‌నెస్, హ్యూమర్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ ఇస్తుంది."

నటుడు విక్రాంత్ మాస్సే (ప్రీతమ్):

"కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. ప్రతి క్యారెక్టర్‌కు ఒక స్వార్థం, ఒక లోపం ఉంటాయి. అదే ఈ కథను మరింత సజీవంగా మార్చింది. ఇందులో నటించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది."

యువ నటుడు వీర్ హిరానీ:

"అర్షద్ సర్ టైమింగ్, విక్రాంత్ డీటెయిలింగ్, మోనా మ్యామ్ నటన.. ఇలా సెట్స్‌లో ప్రతిరోజూ నాకు ఒక మాస్టర్‌క్లాస్‌లా అనిపించింది. ఇంత పెద్ద నటుల మధ్య నా నటనను మెరుగుపరుచుకునే అవకాశం రావడం నా అదృష్టం."

యాక్షన్, కామెడీ, మిస్టరీ, ఎమోషన్స్ సమపాళ్లలో ఉన్న 'ప్రీతమ్ & పెడ్రో' వెబ్ సిరీస్ ఒక యూనివర్సల్ ఎంటర్‌టైనర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, జూలై 3 నుంచి మీ జియోహాట్‌స్టార్ స్క్రీన్‌లపై ఈ క్రేజీ మిస్టరీ రైడ్‌ను వీక్షించడానికి సిద్ధమైపోండి!

Lipika Varma

Lipika Varma

Next Story