Producer Bunny Vasu: బుక్ మై షోపై నిర్మాత బన్నీ వాసు ఫైర్..
నిర్మాత బన్నీ వాసు ఫైర్..

Producer Bunny Vasu: ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోపై టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా టికెట్లు అమ్మే యాప్‌లో సినిమా రేటింగ్‌లు పెట్టడంపై ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ఈ విధానం వల్ల సినిమా పరిశ్రమకు నష్టం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జర్నలిస్టులు సినిమాలపై రివ్యూలు ఇస్తున్నారని, ప్రేక్షకులనుంచి ప్రత్యేకంగా రేటింగ్‌లు అవసరం లేదని బన్నీ వాసు అన్నారు.
టికెట్ కొనుగోలు చేసే సమయంలోనే సినిమా బాగుందా లేదా అని రేటింగ్ ఇవ్వడం సరికాదని ఆయన తప్పుపట్టారు. "మీరు కూడా సినిమా వ్యాపారం మీదే ఆధారపడి ఉన్నారు. ఈ విషయం గుర్తుంచుకోండి" అంటూ ఆయన బుక్ మై షో యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ రేటింగ్‌ల కారణంగా సినిమా నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం బన్నీ వాసు వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. కాగా బన్నీ వాసు సమర్పకుడిగా మిత్రమండలి అనే కొత్త సినిమా వస్తోంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
