Film Chamber Elections: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఘనవిజయం.. అధక్ష్యుడిగా ఎవరంటే..?
అధక్ష్యుడిగా ఎవరంటే..?

Film Chamber Elections: హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. పరిశ్రమలోని ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియోలు అనే నాలుగు విభాగాల కౌన్సిల్ సభ్యులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకునేందుకు ఈ పోలింగ్ నిర్వహించారు. తాజాగా వెలువడిన ఫలితాల ప్రకారం.. ప్రముఖ నిర్మాతల మద్దతు ఉన్న ప్యానెల్ భారీ విజయాన్ని నమోదు చేసింది.
ఈ ఎన్నికల్లో ప్రధానంగా రెండు ప్యానెల్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు వంటి అగ్ర నిర్మాతలు బలపరిచిన ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఒకవైపు ఉండగా.. సి. కల్యాణ్, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు నేతృత్వంలోని మన ప్యానెల్ మరోవైపు పోటీ పడ్డాయి. అంతిమంగా మెజారిటీ ఓటర్లు ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కే మొగ్గు చూపారు.
వివిధ విభాగాల వారీగా ఫలితాలను గమనిస్తే.. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. ఎగ్జిబిటర్స్‌లో 14 స్థానాలు, డిస్ట్రిబ్యూషన్ విభాగంలో 8 స్థానాలను ఈ ప్యానెల్ గెలుచుకుంది. అయితే నిర్మాతల సెక్టార్‌లో మన ప్యానెల్ ఏడు స్థానాలతో పైచేయి సాధించగా స్టూడియో సెక్టార్‌లోనూ మూడు స్థానాలను దక్కించుకుంది. అయినప్పటికీ ఓవరాల్‌గా ఉన్న 44 ఈసీ మెంబర్స్ స్థానాల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 సీట్లు సాధించి స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకుంది.
ఈ ఘనవిజయంతో ఫిల్మ్ ఛాంబర్‌లోని అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి వంటి కీలక పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ సభ్యులకే దక్కనున్నాయి. అధ్యక్షుడిగా సురేశ్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ బాధ్యతలు చేపట్టనున్నారు. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎన్నికలు, ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఆలస్యంగా జరిగాయి. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఈ కార్యవర్గం 2027 జూలై వరకు పదవిలో కొనసాగి, టాలీవుడ్ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించనుంది.

