‘Slumdog’ and ‘Lenin’: పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న స్లమ్‌డాగ్, అఖిల్ అక్కినేని నటిస్తున్నలెనిన్ చిత్రాల ఓటీటీ డీల్స్ ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల డిజిటల్ హక్కుల విషయంలో ప్రముఖ ఓటీటీ సంస్థలతో చర్చలు జరుగుతున్నప్పటికీ, రేటు విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ఆలస్యం జరుగుతోందని సమాచారం.

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో టబు, సంయుక్త మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చార్మీ కౌర్, పూరీ జగన్నాధ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి నిర్మాతలు భారీ ధర కోట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలు బేరసారాలు ఆడుతున్నాయి. భారీ తారాగణం ఉన్నప్పటికీ, ఓటీటీ డీల్ క్లోజ్ అయిన తర్వాతే విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారు.

మరోవైపు అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న "లెనిన్" పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ సినిమా జూన్ 26న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, డిజిటల్ హక్కుల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అఖిల్ గత చిత్రం 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఓటీటీ సంస్థలు ఈ సినిమాకు తక్కువ ధర ఆఫర్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో సీమ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

ప్రస్తుతానికి రెండు సినిమాల నిర్మాతలు తమ సినిమాలకు మంచి రేటు వస్తుందని ఎదురుచూస్తున్నారు. మరో వారం లేదా రెండు వారాల్లో ఈ డీల్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. డీల్స్ ఒక కొలిక్కి వచ్చిన వెంటనే ఈ సినిమాల ప్రమోషన్స్ మరియు విడుదల తేదీల విషయంలో అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story