Raju Weds Rambai Free Show: రాజు వెడ్స్ రాంబాయి ఫ్రీ షో...కానీ
రాజు వెడ్స్ రాంబాయి ఫ్రీ షో

Raju Weds Rambai Free Show: ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, ముఖ్యంగా యువత ఆదరణను పొందిన ప్రేమకథా చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమాకు సంబంధించిన ఓ బంపర్ అఫర్ ఇది. ఈ సినిమాను ఉచితంగా చూసే అరుదైన అవకాశాన్ని చిత్రబృందం కల్పించింది. అయితే ఇది కేవలం మహిళలకు మాత్రమే! ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రముఖ థియేటర్లలో ఈ చిత్రాన్ని మహిళలు ఉచితంగా వీక్షించేందుకు చిత్రబృందం ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఉచిత ప్రదర్శన కేవలం ఈరోజు మాత్రమే అందుబాటులో ఉంటుందని చిత్ర యూనిట్ తమ పోస్ట్‌లో పేర్కొంది. ఆసక్తి గల మహిళా ప్రేక్షకులు నేరుగా ఆయా థియేటర్‌ల దగ్గరకు వెళ్లి, ఉచితంగా టికెట్లు తీసుకొని సినిమా చూడవచ్చని చిత్రబృందం కోరింది. ఈ వినూత్న ప్రచారంతో సినిమాను ఎక్కువ మంది మహిళా ప్రేక్షకులకు చేరువ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ ప్రేమకథా చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వి ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి సాయిలు కంభంపాటి దర్శకత్వం వహించారు. కాగా నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. చాలా పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన ఈ రూరల్ లవ్ స్టోరీ ఇప్పటికే రూ.10 కోట్ల కు పైగా కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు సాయిలు.

