Rakul Preet Singh: దక్షిణాది సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వివాహం తర్వాత సినిమాల ఎంపికలో వేగం తగ్గించినా, కథాబలమున్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. తాజాగా ఆమె నటించిన పతి పత్నీ ఔర్‌ వో దో విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, రకుల్ తన వ్యక్తిగత మరియు సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఐశ్వర్యరాయ్‌ స్ఫూర్తితో మోడలింగ్‌ వైపు..

చిన్నతనం నుంచే రకుల్‌కు గ్లామర్ ప్రపంచం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా 1994లో ఐశ్వర్యరాయ్‌ మిస్ ఇండియా విజేతగా నిలిచిన తర్వాత, తానూ అదే బాటలో నడవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే చదువు పూర్తయ్యాకే మోడలింగ్ చేయాలని తల్లిదండ్రులు చెప్పడంతో 18 ఏళ్లు నిండగానే ఢిల్లీలో మోడలింగ్‌లోకి అడుగుపెట్టారు.

లక్షల రూపాయల పారితోషికం.. ఒక చిన్న ఆశ..

కెరీర్ ప్రారంభంలో దక్షిణాది చిత్ర పరిశ్రమ గురించి రకుల్‌కు పెద్దగా అవగాహన లేదు. ఆర్మీ కుటుంబం కావడంతో కేవలం హిందీ సినిమాలే చేయాలనుకున్నారు. కానీ కన్నడ చిత్ర నిర్మాతలు ఇచ్చిన ఆఫర్ ఆమె జీవితాన్ని మార్చేసింది.‘‘నెల జీతంతో బతికే మా కుటుంబానికి, సినిమాలో నటిస్తే లక్షల్లో పారితోషికం వస్తుందని చెప్పగానే ఆశ్చర్యమేసింది. ఆ డబ్బుతో ఒక కారు కొనుక్కోవచ్చు కదా అనే చిన్న ఆశతోనే అప్పట్లో ఆ కన్నడ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను’’ అని రకుల్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

గోల్ఫ్ ప్లేయర్ నుంచి నటిగా..

చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రకుల్ ఒక మంచి గోల్ఫ్ క్రీడాకారిణి. 10 ఏళ్ల వయసు నుంచే గోల్ఫ్ ఆడటం ప్రారంభించిన ఆమె, జూనియర్ నేషనల్ లెవల్ పోటీల్లోనూ పాల్గొన్నారు. అయితే కెమెరా ముందు అందంగా కనిపించాలన్న కోరిక, ఎండలో గోల్ఫ్ ఆడటం వల్ల చర్మం రంగు మారుతుందన్న ఆందోళనతో ఆమె క్రీడలను పక్కన పెట్టి నటన వైపు మొగ్గు చూపారు. చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా, డిగ్రీ పూర్తయిన తర్వాతే ముంబైకి చేరుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగినట్లు ఆమె పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story