Ram Charan: సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసే నిజమైన నటుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. తెరపై ఆయన చూపించే మాస్ యాక్షన్, ఈవెంట్స్‌లో కనిపించే ఎనర్జీ వెనుక ఎంత కష్టం ఉంటుందో తాజాగా మరోసారి రుజువైంది. మెగా చరణ్ ఆరోగ్యానికి సంబంధించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ తన మణికట్టు సర్జరీ కోసం కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. కోయంబత్తూరులోని ప్రపంచ ప్రఖ్యాత 'గంగా ఆసుపత్రి'లో ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆయనకు ఈ శస్త్రచికిత్స నిర్వహించనుంది.

అసలు ఈ గాయం ఎలా జరిగిందంటే.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన భారీ చిత్రం 'పెద్ది' షూటింగ్ సమయంలో రామ్ చరణ్ మణికట్టుకు తీవ్రమైన గాయమైంది. వైద్యులు వెంటనే సర్జరీ చేయించుకోవాలని, విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ.. సినిమా షూటింగ్ ఆగిపోకూడదనే ఉద్దేశంతో ఆయన సర్జరీని వాయిదా వేసుకున్నారు.

అంతటితో ఆగకుండా, తీవ్రమైన నొప్పులను సైతం భరిస్తూ 'పెద్ది' సినిమా షూటింగ్‌తో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లోనూ ఏమాత్రం తగ్గకుండా చాలా చురుగ్గా పాల్గొన్నారు. సినిమాపై ఆయనకున్న అంకితభావానికి, డెడికేషన్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ముగియడంతో, తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టారు చరణ్. ఈ క్లిష్ట సమయంలో రామ్ చరణ్‌కు నైతిక ధైర్యాన్ని అందించేందుకు మెగా కుటుంబం మొత్తం ఆయనతో పాటు కోయంబత్తూరుకు వెళ్లడం విశేషం.

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కూడా ఆసుపత్రి వద్దే ఉంటూ ఆయన యోగక్షేమాలను చూసుకుంటున్నారు. ఈ సర్జరీ ముగిసిన తర్వాత, వైద్యుల సూచన మేరకు రామ్ చరణ్ కొన్ని వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ రీ-హాబిలిటేషన్, రెస్ట్ పీరియడ్ పూర్తయిన తర్వాతే ఆయన తన తదుపరి భారీ ప్రాజెక్ట్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సర్జరీ నుంచి పూర్తిగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story