‘Irumudi’: రవితేజ ఇరుముడిలో రామ్ చరణ్ గెస్ట్ రోల్? పుకార్లపై క్లారిటీ ఇచ్చిన మెగా టీమ్
పుకార్లపై క్లారిటీ ఇచ్చిన మెగా టీమ్

‘Irumudi’: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగింది. ముఖ్యంగా చిత్రంలోని ‘మల్లెపూల పల్లకి బంగారు పల్లకి’ అనే అయ్యప్ప భక్తి గీతంలో చరణ్ అయ్యప్ప మాలధారణతో దర్శనమిస్తారంటూ వచ్చిన వార్తలపై రామ్ చరణ్ బృందం స్పందించి పూర్తి స్పష్టతనిచ్చింది.
పుకార్లను ఖండించిన చరణ్ టీమ్
ఇరుముడి చిత్రంలో రామ్ చరణ్ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం నిరాధారమైన రూమర్స్ మాత్రమేనని మెగా టీమ్ కొట్టిపారేసింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మల్లెపూల పల్లకి’ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. సినిమాలో ఈ పాట వచ్చే సమయంలో ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ ఉంటుందని చెప్పడంతో చరణ్ గెస్ట్ అప్పియరెన్స్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. వ్యసనాలకు బానిసైన ఒక వ్యక్తి 41 రోజుల పాటు అయ్యప్ప మండల దీక్ష స్వీకరించాల్సి వస్తే, ఆ క్రమంలో మద్యానికి దూరంగా ఉండేందుకు అతడు పడే అంతర్మథనం, జీవితంలో జరిగే పరిణామాల చుట్టూ ఈ చిత్ర కథ సాగుతుందని దర్శకుడు వెల్లడించారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

