ఆ శబ్దం నన్ను ఊపేసేది.. ఆర్జీవీ ఇంటరెస్టింగ్ కామెంట్స్..

Ram Gopal Varma: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా అందులో ఒక లాజిక్, అంతకు మించి ఒక వైవిధ్యం ఉంటుంది. తాజాగా ఆయన తన చిన్ననాటి కలలు, తన సినిమాల వెనుక ఉన్న అసలు ప్రేరణల గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తను ఒకప్పుడు ఆటో డ్రైవర్ కావాలనుకున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

వ్రూమ్ వ్రూమ్ శబ్దమే నా క్రేజ్

వర్మ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. "నాకు పదేళ్ల వయసున్నప్పుడు ఆటో రిక్షా డ్రైవర్ అవ్వాలని బలంగా ఉండేది. ఆటో యాక్సిలరేటర్ పెంచినప్పుడు వచ్చే ఆ వ్రూమ్ వ్రూమ్ సౌండ్ నన్ను విపరీతంగా ఆకర్షించేది" అని చెప్పుకొచ్చారు. కేవలం ఆటో డ్రైవర్‌గానే కాకుండా, కాలంతో పాటు తన ఆలోచనలు ఎలా మారాయో కూడా వివరించారు.

15 ఏళ్ల వయసులో అడవిలో బతకాలని కలలు కన్నారు. ఆ తర్వాతి దశలో ఇంజనీర్ అవ్వాలని అనుకున్నారు. చివరికి సినిమాలపై మక్కువతో దర్శకుడిగా స్థిరపడ్డారు.

పుస్తకాలే నా ప్రపంచం..

సాహిత్యంపై తనకున్న ఇష్టాన్ని తెలుపుతూ.. ఒకప్పుడు ఎనిడ్ బ్లైటన్ పుస్తకాలు చదివేవాడినని, ఆ తర్వాత జేమ్స్ హాడ్లీ చేజ్ రచనలకు ఫిదా అయ్యానని చెప్పారు. అయితే ఫ్రెడరిక్ ఫోర్సెత్ పుస్తకాలు చదివాక తన ఊహల పరిధి మరింత పెరిగిందని, నిరంతరం కొత్త అనుభవాలు మన ప్రమాణాలను పెంచుతూనే ఉంటాయని వర్మ విశ్లేషించారు.

నా సినిమాల వెనుక ఉన్న బెంచ్‌మార్క్ లు ఇవే..

తన కెరీర్‌లో క్లాసిక్ హిట్‌లుగా నిలిచిన చిత్రాలకు ప్రేరణ ఏంటో కూడా ఆర్జీవీ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రంగీలాను ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ స్ఫూర్తితో తీశారు. రాత్ & భూత్ పై హారర్ క్లాసిక్ ఎక్సార్సిస్ట్ ప్రభావం వీటిపై ఉంది. సత్య, కంపెనీ, సర్కార్ వంటీ చిత్రాలకు మూలసూత్రం మరియు బెంచ్‌మార్క్ ప్రపంచ ప్రసిద్ధ చిత్రం గాడ్ ఫాదర్. "నా కెరీర్ మొత్తం ఆ బెంచ్‌మార్క్‌ల నుంచే సినిమాలు తీశాను, ప్రధానంగా గాడ్ ఫాదర్ నుంచే నా గ్యాంగ్‌స్టర్ సినిమాలు పుట్టాయి" అని వర్మ క్లారిటీ ఇచ్చారు. నిరంతరం మనల్ని మనం అప్‌డేట్ చేసుకుంటూ కొత్త లక్ష్యాలను సెట్ చేసుకోవాలనే వర్మ ఫిలాసఫీ ఇప్పుడు ఫిలిం మేకర్లలో చర్చకు దారితీస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story