Yash Praises Ranbir Kapoor: శాన్ డియాగో కామిక్-కాన్‌లో రామాయణ సందడి.. రణ్‌బీర్‌పై యశ్ ప్రశంసలు
రణ్‌బీర్‌పై యశ్ ప్రశంసలు

Yash Praises Ranbir Kapoor: ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ' గ్లోబల్ రేంజ్‌లో సందడి చేస్తోంది! అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 'శాన్ డియాగో కామిక్-కాన్ 2026' వేడుకల్లో రామాయణ చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది.
ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, కన్నడ రాకింగ్ స్టార్ యశ్, దర్శకుడు నితీశ్ తివారీ , నిర్మాత నమిత్ మల్హోత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్‌బీర్ కపూర్ నటనపై యశ్ ప్రశంసల వర్షం కురిపించారు. 'రాముడి పాత్ర పోషించడం చాలా కష్టమైన విషయమని, కానీ రణ్‌బీర్ ఆ పాత్ర కోసం ఎంతో నిబద్ధతతో, అద్భుతంగా కష్టపడ్డాడని' యశ్ కొనియాడారు.
సినిమా స్క్రీన్‌పై చూసినప్పుడు రణ్‌బీర్ పడ్డ కష్టం, ఆయన డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తుందని యశ్ అన్నారు. మేకప్ నుంచి లుక్స్ వరకు, సాంకేతికంగా ఈ సినిమా ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని... అయితే ఒక మంచి టీమ్ కుదిరినప్పుడు ప్రతిదీ కలిసి వస్తుందని చెప్పారు. ఈ సినిమా ప్రయాణంలో జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టామని, తమ శక్తివంచన లేకుండా కృషి చేశామని యశ్ పేర్కొన్నారు.
ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ నేడు విడుదల కావాల్సి ఉండగా... సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో విడుదల చేయాలని భావిస్తున్నామని, త్వరలోనే కొత్త ట్రైలర్ విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు.

