ఆ సీన్ చేయనని ఏడ్చింది - డైరెక్టర్ రవికుమార్

Director Ravikumar: ప్రముఖ సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రజనీకాంత్‌తో తన అనుబంధం, 'నరసింహ' సినిమాలోని కొన్ని కీలక ఘట్టాలను గురించి వివరించారు.‘‘తమిళంలో నేను దర్శకత్వం వహించిన 'నాట్టమై' సినిమాను తెలుగులో 'పెదరాయుడు'గా రీమేక్ చేశారు. అది పెద్ద హిట్ అయింది. అయితే, తమిళ వెర్షన్‌లో ఆ పాత్ర కోసం రజనీకాంత్‌ను అడగలేదు, ఎందుకంటే అప్పుడు నాకు ఆయన పరిచయం లేదు'' అని రవికుమార్ తెలిపారు. ''తర్వాత రజనీ సార్ నన్ను పిలిపించి ఒక మంచి కథను సిద్ధం చేయమని అడిగారు. అప్పుడు నేను సిద్ధం చేసుకున్న కథే 'ముత్తు'. ఆ సినిమా తమిళం, తెలుగు భాషల్లో సంచలన విజయం సాధించింది. ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది'' అని రవికుమార్ అన్నారు.

రజనీకాంత్‌తో తాను చేసిన నరసింహ, లింగ సినిమాల్లో.. నరసింహ రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిందని రవికుమార్ చెప్పారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన 'నీలాంబరి' పాత్రకు ఎంతో మంచి పేరు వచ్చిందన్నారు. ‘‘ఈ సినిమాలో 'నీలాంబరి' పాత్రకు మొదట మీనా అయితే బాగుంటుందని అనుకున్నారు. కానీ ఆ పాత్రలో ఉండే 'కన్నింగ్' స్వభావానికి మీనా సరిపోదని, ఆమె ముఖంలో పసితనం ఉంటుందని నేను అన్నాను. నగ్మా లేదా రమ్యకృష్ణ అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తారని చెప్పాను. చివరికి రమ్యకృష్ణ ఓకే అయ్యారు'' అని వివరించారు.

నరసింహ సినిమాలో ఒక సన్నివేశంలో రమ్యకృష్ణ తన పాదంతో సౌందర్య చెంపను తాకాల్సి ఉంటుంది.. ఆ సన్నివేశం చేయడానికి రమ్యకృష్ణ ఏడ్చేశారని రవికుమార్ గుర్తుచేసుకున్నారు. ‘‘అప్పుడు సౌందర్య ముందుకు వచ్చి, 'ఏం పర్వాలేదు' అంటూ రమ్యకృష్ణ పాదాన్ని తీసుకుని తన చెంప దగ్గర పెట్టుకుంది. ఆ సీన్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది’’ అని డైరెక్టర్ రవికుమార్ తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story