Bollywood actress Rani Mukerji: కూతురు లేఖతో కంటతడి పెట్టిన రాణీ ముఖర్జీ – అమ్మగా గెలిచిన సూపర్‌స్టార్
అమ్మగా గెలిచిన సూపర్‌స్టార్
Bollywood actress Rani Mukerji: బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ మరోసారి తన నటనతోనే కాదు, తన మాతృత్వంతో కూడా అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తెరపై లక్షల మందికి ఆదర్శంగా నిలిచిన రాణీ, నిజ జీవితంలో మాత్రం తన కూతురు అదిరాకు నిజమైన సూపర్‌స్టార్. మీడియా కంటికి దూరంగా అదిరాను పెంచుతూ, ఆమెకు సాధారణ బాల్యాన్ని అందించడంలో రాణీ ఎప్పుడూ ముందుంటుంది. సోషల్ మీడియాలో అతిగా కనిపించకుండా, ఆమె బాల్యాన్ని కాపాడటమే తన ముఖ్య లక్ష్యమని రాణీ ఎన్నోసార్లు చెప్పింది.
సినీ పరిశ్రమలో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు కరణ్ జోహార్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో రాణీకి ఓ అపురూపమైన క్షణం ఎదురైంది. ఆ కార్యక్రమంలో అదిరా రాసిన చేతివ్రాత లేఖను కరణ్ జోహార్ చదివి వినిపించారు. ఆ లేఖ వింటూ రాణీ కళ్లలో నీళ్లు తిరిగాయి. చిరునవ్వుతో పాటు భావోద్వేగం కలగలిపిన ఆ క్షణం ప్రేక్షకుల మనసులను తాకింది.
అదిరా తన లేఖలో, “ముందుగా నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే… ఐ లవ్ యూ మమ్మా. నువ్వే ప్రపంచంలో బెస్ట్ మదర్. మనిద్దరం కలిసి ఆనందమైనవి, కన్నీటి జ్ఞాపకాలు, అలాగే చాలా ఫన్నీ క్షణాలు.. ఎన్నో జ్ఞాపకాలను పంచుకున్నాం. నీలో నాకు నచ్చిన లక్షణాలు కొన్ని ఉన్నాయి, నచ్చని లక్షణాలు కొన్ని ఉన్నాయి, అలాగే నిన్నుంచి నేను వారసత్వంగా పొందిన లక్షణాలు కూడా ఉన్నాయి” అని రాసింది.
ఆమె ఇంకా ఇలా కొనసాగించింది… “నువ్వు ఇచ్చిన నటన, నాట్యం, పెయింటింగ్ లాంటి ప్రతిభలు నాకు వచ్చాయి. కానీ నీలో నాకు నచ్చని ఒక లక్షణం.. నీ షార్ట్ టెంపర్ అది కూడా నాకు వచ్చింది. నువ్వు బోల్డ్ కలర్స్ ఇష్టపడితే, నాకు పాస్టెల్ షేడ్స్ ఇష్టం. రూపం, అలవాట్లు, ప్రతిభలో మనం చాలావరకు ఒకేలా ఉంటాం.. అలాగే నాకు ఉన్న కొన్ని లక్షణాలు నీకు లేవు, ఉదాహరణకు నా స్కూల్ మ్యాథ్స్ స్కిల్స్. నేను పెద్దయ్యాక నీలా దయగల, ఆత్మవిశ్వాసం ఉన్న, ప్రేమగల, తెలివైన, స్టైలిష్ వ్యక్తిగా మారాలని కోరుకుంటున్నాను” అని భావోద్వేగంగా పేర్కొంది.
ఇదిలా ఉండగా, రాణీ ముఖర్జీ తన సినీ కెరీర్‌లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మర్దానీ 3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆమె మరోసారి ధైర్యమైన పోలీస్ ఆఫీసర్ శివాని శివాజీ రాయ్ పాత్రలో కనిపించనుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రానికి అభిరాజ్ మినావాలా దర్శకత్వం వహించారు. ‘మర్దానీ 3’ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


