Ranveer Singh: బ్లాక్‌బస్టర్ చిత్రం కాంతారలోని పవిత్రమైన దైవ రూపాన్ని మిమిక్రీ చేసి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ స్టార్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఎట్టకేలకు మైసూర్‌లోని ప్రముఖ చాముండేశ్వరి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. కర్ణాటక హైకోర్టుకు ఇచ్చిన హామీ మేరకు ఆయన ఆలయానికి చేరుకుని దైవానికి క్షమాపణలు చెప్పుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ 2025 ముగింపు వేడుకల్లో కాంతార దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి సమక్షంలోనే ఈ వివాదానికి బీజం పడింది. ఆ చిత్రంలో రిషబ్ ప్రదర్శించిన అత్యంత పవిత్రమైన దైవ నృత్యం (భూత కోల) ను రణ్‌వీర్ సింగ్ స్టేజ్ పైన కాస్త అతిగా అనుకరిస్తూ మిమిక్రీ చేయడమే కాకుండా, తుళునాడు ప్రజలు దైవాలుగా కొలిచే ఆ రూపాలను దయ్యాలుగా సంబోధించడం తీవ్ర దుమారానికి దారితీసింది. కన్నడ సంస్కృతిని, ఆచారాలను రణ్‌వీర్ తీవ్రంగా అవమానించారంటూ సామాజిక మాధ్యమాల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది.

ఈ ఘటనపై బెంగళూరుకు చెందిన ఒక న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రణ్‌వీర్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రణ్‌వీర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా, విచారణ సందర్భంగా తాను చాముండేశ్వరి దేవిని దర్శించుకుని క్షమాపణలు కోరతానని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు జస్టిస్ నాగప్రసన్న, రాబోయే 4 వారాల వ్యవధిలో ఆలయాన్ని సందర్శించాలని రణ్‌వీర్‌కు గడువు విధించారు. కోర్టు ఆదేశించిన కొన్ని రోజుల్లోనే రణ్‌వీర్ సింగ్ తన బిజీ షూటింగ్ షెడ్యూల్స్ అన్నింటినీ పక్కనబెట్టి మైసూర్ చేరుకుని, చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రాయశ్చిత్త పూజలు పూర్తి చేసుకున్నారు.

ఈ వివాదంపై రణ్‌వీర్ సింగ్ మరోసారి స్పందిస్తూ మీడియాకు స్పష్టత ఇచ్చారు. ఆ సినిమాలో రిషబ్ శెట్టి కనబరిచిన అద్భుతమైన నటనను ప్రశంసించడమే తన అసలు ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఒక నటుడిగా, ఆ నిర్దిష్టమైన సీన్‌లో అంతటి హావభావాలు పండించడానికి ఎంతటి కఠినమైన కృషి అవసరమో తనకు తెలుసని, రిషబ్ నటన పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని వివరించారు. మన దేశంలోని ఏ సంస్కృతిని, సంప్రదాయాలను లేదా ప్రజల నమ్మకాలను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని, తన ప్రవర్తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే హృదయాపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని రణ్‌వీర్ సింగ్ స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story