అరుదైన గౌరవం

Rishab Shetty: కన్నడ ప్రముఖ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం దక్కింది. బ్లాక్‌బస్టర్ సినిమా 'కాంతార'తో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తాజాగా ఆస్ట్రేలియా వేదికగా ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు.
ఆస్ట్రేలియాలో నిర్వహించనున్న 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్' (IFFM) 2026 ఎడిషన్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ వేడుకలో రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక 'లీడర్షిప్ ఇన్ సినిమా' (Leadership in Cinema) అవార్డుకు ఎంపికయ్యారు. వచ్చే నెల ఆగస్టు 13న మెల్బోర్న్‌లో జరగనున్న ఈ చలనచిత్రోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మన మూలాలను ప్రతిబింబించే అద్భుతమైన కథలను వెండితెరకు ఎక్కించి.. వాటిని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చాటిచెప్పినందుకు గాను ఐఎఫ్ఎఫ్ఎం (IFFM) ఈ నిర్ణయం తీసుకుంది. 'కాంతార' చిత్రం ద్వారా ఆయన సృష్టించిన సంచలనం, సినిమా రంగానికి ఆయన అందించిన సేవలను ఈ వేదికపై ఘనంగా గౌరవించనున్నారు.
ఈ అరుదైన గౌరవం దక్కడంపై రిషబ్ శెట్టి సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చూపించేందుకు తాను ఎప్పుడూ కథలనే మార్గంగా ఎంచుకుంటానని.. మన మూలాలతో కూడిన కథలు గ్లోబల్ ఆడియన్స్‌కు చేరుతుండటం ఎంతో ఆనందాన్నిస్తోందని తెలిపారు. మెల్బోర్న్ వేడుకల్లో తోటి సినీ ప్రముఖులు, అభిమానులతో కలిసి పాలుపంచుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

