Rashmika Joins Allu Arjun's 'Raaka' ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’ గురించి ప్రస్తుతం ఒక క్రేజీ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ‘పుష్ప’, ‘పుష్ప 2’ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన అల్లు అర్జున్, రష్మిక మందన్న లక్కీ కాంబో ఈ సినిమాతో మరోసారి రిపీట్ కాబోతున్నట్లు బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మిక మందన్న జూలై నెల నుండి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లో "కాక్‌టైల్ 2" చిత్రంతో అలరించిన ఈ ముద్దుగుమ్మ, త్వరలోనే విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న "రణబలి" చిత్రంతో ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలోనే రష్మిక మందన్న ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో రాబోతున్న "రాకా" అనే క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రకు సంతకం చేసినట్లు ఇండస్ట్రీ టాక్. జూలై నెలలో ప్రారంభం కానున్న తాజా షెడ్యూల్‌లో ఆమె తన పోర్షన్స్ కోసం షూటింగ్‌లో పాల్గొననుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే.. అల్లు అర్జున్‌తో రష్మికకు ఇది హ్యాట్రిక్ కాంబినేషన్ అవుతుంది. ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూడో చిత్రం ఇదే కావడం విశేషం.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మక స్థాయిలో "రాకా" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్సులు, హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్‌పై (VFX) ఆధారపడి రూపొందుతోంది. దీని కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, అంతర్జాతీయ స్టూడియోలు రంగంలోకి దిగి కీలకమైన సాంకేతిక విభాగాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేయగా, రాబోయే ఆగస్టు నెలలో ఈ సినిమాకు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందనే వార్త ఫ్యాన్స్‌లో అంచనాలను పెంచేస్తోంది.

దర్శకుడు అట్లీకి టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్‌లో తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది. విజయ్‌తో వరుస బ్లాక్‌బస్టర్లు మరియు షారుఖ్ ఖాన్‌తో "జవాన్" వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న అట్లీ.. ఇప్పుడు అల్లు అర్జున్‌తో చేయబోయే ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ చిత్రంగా నిలవనుంది. సన్ పిక్చర్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రధాన కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో రష్మిక మందన్న నెగెటివ్ షేడ్స్ (విలన్) ఉన్న పాత్రలో కనిపించబోతోందనే సరికొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ పాత్రపై చిత్ర మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

PolitEnt Media

PolitEnt Media

Next Story