Rashmika Mandanna : ఫెమినైన్ ఎనర్జీపై రష్మిక మందన్న ఆసక్తికర పోస్ట్
రష్మిక మందన్న ఆసక్తికర పోస్ట్

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల సోషల్ మీడియాలో స్త్రీ శక్తి గురించి పంచుకున్న అభిప్రాయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన బిజీ షెడ్యూల్ నుంచి కొంత విరామం తీసుకుని, మహిళల్లో సహజంగా ఉండే ఈ శక్తి గురించి రష్మిక తన ఆలోచనలను పంచుకున్నారు. ఫెమినైన్ ఎనర్జీలో ఏదో ప్రత్యేకత ఉందని, దాన్ని మాటల్లో వర్ణించలేనని రష్మిక పేర్కొన్నారు. "మనతో మనం నిజంగా కనెక్ట్ అయినప్పుడు, పరిస్థితులను, వ్యక్తులను ఇట్టే అర్థం చేసుకోగలుగుతాం. ఏదైనా తప్పు జరగబోతోందని మనసు ముందే చెబుతుంది" అని రష్మిక తెలిపారు. అయితే కొన్నిసార్లు జీవితంలోని సంక్లిష్టతల వల్ల ఈ అంతర్ దృష్టిని పట్టించుకోలేకపోతున్నామని ఆమె అభిప్రాయపడ్డారు.
మహిళల ఏకత్వమే బలం
మహిళలు ఒకరికొకరు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను రష్మిక గట్టిగా నొక్కి చెప్పారు. "మహిళలు ఒకరికొకరు అండగా నిలవడం, ఒకరి సమస్యలను మరొకరు ఓపికగా వినడం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు జీవితం మరికొంత సులభంగా మారుతుంది" అని ఆమె తెలిపారు.
శక్తిమంతమైన, మృదువైన శక్తి
ఈ ఫెమినైన్ ఎనర్జీని అర్థం చేసుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని రష్మిక వెల్లడించారు. "ఇప్పుడు అర్థమైంది కాబట్టి, దీన్ని అన్ని విధాలా కాపాడుకుంటాను. ఫెమినైన్ ఎనర్జీ బలహీనమైంది కాదు. అది మృదువుగా ఉంటుంది. కానీ చాలా శక్తిమంతమైంది. ప్రేమతో నిండి ఉంటుంది" అని ఆమె వివరించారు. అలాంటి శక్తితో మహిళలందరూ ఏకమైతే, వారిని ఎవరూ ఆపలేరని రష్మిక తన పోస్ట్‌ను ముగించారు.

