Actress Rashmika Mandanna: మైసా కోసం డూప్ లేకుండా 20 గంటలు నీటిలోనే రష్మిక సాహసం!
రష్మిక సాహసం!

Actress Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయిని అందుకుంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టిస్తూ, దేశంలోనే మొట్టమొదటి మహిళా అండర్ వాటర్ (నీటి అడుగున జరిగే) ఫైట్ సీక్వెన్స్‌ను ఆమె విజయవంతంగా పూర్తి చేసింది. రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం "మైసా" (Mysaa) కోసం ఈ అత్యంత కష్టతరమైన యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. ఎటువంటి డూప్ లేదా బాడీ డబుల్ సహాయం లేకుండా రష్మిక ఈ సాహసోపేతమైన ఫైట్ సీన్‌ను స్వయంగా చేయడం విశేషం.
యాక్షన్ సినిమాల్లో ఇదొక సరికొత్త అధ్యాయమని, రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన భారతదేశపు మొదటి మహిళా అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్‌ను విజయవంతంగా పూర్తి చేశామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. భారతీయ సినిమాను ఒక ఊపు ఊపేలా, వెండితెరపై మునుపెన్నడూ చూడని విజువల్ వండర్‌గా ఈ యాక్షన్ సీన్ ఉండబోతోందని మేకర్స్ పేర్కొన్నారు. కేవలం రెండు రోజుల్లోనే రష్మిక దాదాపు 20 గంటల పాటు నీటి అడుగున గడుపుతూ ఈ స్టంట్స్‌ను పూర్తి చేయడం ఆమె అంకితభావానికి నిదర్శనం. సినిమా మొత్తానికే ఈ సీన్ ప్రధాన హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.
ఈ సినిమాలో రష్మిక మందన్న ఒక గోండు తెగకు చెందిన గిరిజన యువతిగా నటిస్తోంది. ఆమె కెరీర్‌లోనే శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్న మరియు వైవిధ్యమైన పాత్ర ఇది. ప్రముఖ దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడైన రవీంద్ర పుల్లె ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సాయి గోప కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. భారతీయ యాక్షన్ సినిమాల సరిహద్దులను దాటుతూ సరికొత్త సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ "మైసా" చిత్రం 2026 లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

