ఫస్ట్ సింగిల్ అదిరిందిగా

Ravi Teja's 'Irumudi': మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఇరుముడి'. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఆగస్టు 21న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో... తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
ఇరుముడి కట్టు పేరుతో విడుదలైన ఈ పాట భక్తిభావంతో పాటు, అంతే హుషారుగా సాగింది. ఇందులో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించి, స్వామివారి భక్తుడిగా ఎనర్జిటిక్ చిందులేసి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ పాటకు... డైరెక్టర్ శివ నిర్వాణతో పాటు లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి అదిరిపోయే లిరిక్స్ అందించారు. సింగర్ అనంతు తన హుషారైన గొంతుతో ఈ పాటను పాడారు.మండలి దీక్ష ముగిసింది.. మాలకి అర్ధం తెలిసింది.. శబరికొండ పిలిచింది.. మణికంఠుని చేరగా పదిమంది.. హే కట్టు కట్టు.. ఇరుముడి కట్టు.. ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు" అంటూ సాగే ఈ లిరిక్స్ భక్తులతో చిందులేయించేలా ఉన్నాయి.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, 'బేబీ' ఫేమ్ నక్షత్ర ఒక కీలక పాత్రలో కనిపించనుంది. అలాగే సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.మలయాళంలో సూపర్ హిట్ అయిన 'మాలికాపురం' సినిమాకు ఇది రీమేక్ అనే టాక్ నడుస్తోంది. దీనిపై చిత్ర బృందం అటు ఖండించలేదు.. ఇటు కన్ఫర్మ్ కూడా చేయలేదు. ప్రస్తుతానికి ఇది కేవలం సోషల్ మీడియా పుకారుగానే మిగిలింది.

