Mookuthi Amman 2: నయనతారతో రెజీనా హైవోల్టేజ్ ఫైట్.. మూకుత్తి అమ్మన్ 2 పై క్రేజీ అప్డేట్
క్రేజీ అప్డేట్

Mookuthi Amman 2: గ్లామరస్ పాత్రలతో పాటు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న టాలెంటెడ్ నటి రెజీనా కసాండ్రా తన సినీ ప్రయాణంలో కీలక మలుపు తీసుకోనున్నారు. కెరీర్‌లో మొదటిసారిగా ఆమె ఒక పూర్తిస్థాయి కమర్షియల్ విలన్ అవతారమెత్తారు. స్టార్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో, లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూకుత్తి అమ్మన్ 2 చిత్రంలో రెజీనా ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు.
భైరవి పాత్రలో ప్రాణం పెట్టా: రెజీనా కసాండ్రా
సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొన్న రెజీనా తన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విశేషాలను వెల్లడించారు. ఈ సినిమాలో తాను పోషించిన భైరవి క్యారెక్టర్ ఎంతో బలంగా, సరికొత్త పంథాలో ఉంటుందని స్పష్టం చేశారు. "తొలిసారిగా పూర్తిస్థాయి కమర్షియల్ విలన్ పాత్రలో నటించాను. భైరవి పాత్రను వెండితెరపై నిలబెట్టడానికి ఎంతో కష్టపడి ప్రాణం పెట్టి చేశాను. ముఖ్యంగా నయనతారతో సాగే యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. థియేటర్లలో ఈ ఫైట్స్ చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ థ్రిల్ ఫీలవుతారు" అని రెజీనా నమ్మకం వ్యక్తం చేశారు.
దర్శకుడు సుందర్ సి పై ప్రశంసల జల్లు
ఈ సందర్భంగా సీనియర్ దర్శకుడు సుందర్ సి పనితీరును రెజీనా కొనియాడారు. ఇతర భాషా పరిశ్రమలకు వెళ్లకుండా, దాదాపు మూడు దశాబ్దాలుగా కోలీవుడ్‌లోనే ఉంటూ తమిళ సినిమా స్థాయిని పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్లిన గొప్ప విజనరీ డైరెక్టర్ సుందర్ సి అని ఆమె పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రతినాయక పాత్ర చేయడం తన అదృష్టమని తెలిపారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మూకుత్తి అమ్మన్ 2
2020లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన డివోషనల్ కామెడీ ఎంటర్‌టైనర్ మూకుత్తి అమ్మన్ (తెలుగులో అమ్మోరు తల్లి) చిత్రానికి ఇది సీక్వెల్‌గా రాబోతోంది. ప్రముఖ నిర్మాత డాక్టర్ ఇషారి కె. గణేష్ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నయనతారతో పాటు ఖుష్బూ, స్నేహ, రెజీనా కసాండ్రా వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహిళా ప్రాధాన్యమున్న భారీ చిత్రాలను నిర్మిస్తూ పరిశ్రమలోని నటీమణులకు కొత్త శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్న నిర్మాత ఇషారి కె. గణేష్‌కు రెజీనా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అమ్మోరుగా నయనతార, ప్రతినాయకిగా రెజీనా మధ్య సాగే హోరాహోరీ పోరాటం వెండితెరపై సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

