Actor Pankaj Dheer: ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ కన్నుమూత
పంకజ్ ధీర్ కన్నుమూత

Actor Pankaj Dheer: భారతీయ సినిమా. టెలివిజన్ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ వెటరన్ నటుడు పంకజ్ ధీర్ 68 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన బుధవారంతుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు, సినీ వర్గాలు ధృవీకరించాయి. బి.ఆర్. చోప్రా నిర్మించిన 'మహాభారత్' టీవీ ధారావాహికలో ఆయన పోషించిన కర్ణుడి పాత్ర ద్వారా పంకజ్ ధీర్ దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు పొందారు. తెరపై ఆయన చూపిన అద్భుతమైన నటన, గంభీరమైన రూపం, భావోద్వేగ చిత్రణ... కర్ణుడి పాత్రకు నిండుదనాన్ని తీసుకొచ్చాయి. నేటికీ ఆయనను 'మహాభారత్ కర్ణుడు'గానే అభిమానులు గుర్తుంచుకుంటారు. 'మహాభారత్' తో పాటు, పంకజ్ ధీర్ అనేక సినిమాలు మరియు టీవీ షోలలో తనదైన ముద్ర వేశారు. సడక్, సోల్జర్, బాద్‌షా, తుమ్‌కో నా భూల్ పాయేంగే వంటి బాలీవుడ్ చిత్రాలలో ముఖ్యపాత్రలు పోషించారు. 'చంద్రకాంత' (శివదత్ రాజుగా), 'ది గ్రేట్ మరాఠా', 'ససురాల్ సిమర్ కా', 'రాజా కీ ఆయేగీ బారాత్' వంటి పలు హిట్ సీరియల్స్‌లో నటించి మెప్పించారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పంకజ్ ధీర్, కొంతకాలం చికిత్స తీసుకుని కోలుకున్నప్పటికీ, ఇటీవలి నెలల్లో ఆరోగ్యం క్షీణించింది. ఈ రోజు ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సినీ, టీవీ నటులు, దర్శకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) కూడా ఆయన మృతిని ధృవీకరిస్తూ, తమ సంతాపం తెలియజేసింది. పంకజ్ ధీర్‌కు భార్య అనిత ధీర్, కుమారుడు (నటుడు) నికితిన్ ధీర్ ఉన్నారు. నికితిన్ ధీర్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్', 'జోధా అక్బర్' వంటి చిత్రాలలో నటించారు. దివంగత నటుడి అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముంబైలో జరగనున్నాయి. ఆయన అకాల మరణం భారతీయ సినీ ప్రియులను శోకంలో ముంచింది.
