Rishab Shetty: సంపాదించిన డబ్బు మొత్తం సినిమాలకే.. రిషబ్ శెట్టి గ్రేట్ డెసిషన్
రిషబ్ శెట్టి గ్రేట్ డెసిషన్

Rishab Shetty: కాంతార సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి.. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'జై హనుమాన్' లో ఆయన నటిస్తుండగా.. దీనితో పాటు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న 'ది ప్రైడ్ ఆఫ్ భారత్' లోనూ లీడ్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రెండు భిన్నమైన చిత్రాల గురించి రిషబ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు."
"ఒకేసారి రెండు భారీ సినిమాల్లో నటించడం కొంచెం కష్టమైన పనే అని రిషబ్ శెట్టి అన్నారు. రెండింటికీ పూర్తిగా వేర్వేరు లుక్స్ అవసరమని.. అందుకే ముందుగా 'జై హనుమాన్' పూర్తి చేసిన తర్వాతే, శివాజీ మహారాజ్ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తనకు ఎంతో ఇష్టమైన, ఆనందాన్నిచ్చే దర్శకత్వ బాధ్యతలను మాత్రం వదిలిపెట్టనని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఈ ఏడాది చివర్లో ‘రిషబ్ శెట్టి ఫిల్మ్స్’ బ్యానర్‌పై మరో రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించబోతున్నట్లు గుడ్ న్యూస్ చెప్పారు. తాను సినిమాల ద్వారా సంపాదించిన ప్రతి రూపాయిని మళ్లీ మంచి చిత్రాల నిర్మాణానికే ఖర్చు పెడతానని ఆయన వెల్లడించారు."
"ఇక బెంగళూరులో ఫిల్మ్ సిటీ కావాలనే కన్నడ పరిశ్రమ సుదీర్ఘ డిమాండ్‌పై రిషబ్ శెట్టి వినూత్నంగా స్పందించారు. ఫిల్మ్ సిటీ లేదనే అసంతృప్తి పరిశ్రమలో ఉన్న మాట వాస్తవమేనని.. అయితే తాను మాత్రం ప్రభుత్వం వైపు చూడకుండా, తన సొంత ఊరైన 'కెరాడి'లో ఒక అద్భుతమైన 'సినిమా విలేజ్'ను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 'కాంతార చాప్టర్ 1' పనులన్నీ ఎక్కువగా అక్కడే పూర్తి చేశామని.. తన ఊరిని సినిమా హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని రిషబ్ శెట్టి గర్వంగా చెప్పుకొచ్చారు.

