90ల నాటి క్లాసిక్ ‘రోజా’ ఫేమ్ మధుబాల కేవలం రెండు వారాల వ్యవధిలో ‘గవర్నర్’, ‘చిన్న చిన్న ఆసై’ చిత్రాలతో సంచలన రీ-ఎంట్రీకి సిద్ధమయ్యారు.

తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి మధు (Actress Madhoo) సినీ కెరీర్‌లో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఒకప్పుడు 'ఫూల్ ఔర్ కాంటే', 'రోజా', 'జెంటిల్‌మన్', 'అల్లరి ప్రియుడు' వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలతో యావత్ భారతదేశాన్ని ఊపేసిన ఈ అందాల నటి, ఇప్పుడు కేవలం రెండు వారాల వ్యవధిలోనే రెండు పెద్ద చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ రెండు సినిమాలు తన హృదయాన్ని హత్తుకున్నాయని, తన కెరీర్‌లో ఇవి చాలా ప్రత్యేకం అని మధు సంతోషం వ్యక్తం చేశారు. ఆమె నటించిన హిందీ చిత్రం ‘గవర్నర్’ (Governor) జూన్ 12న విడుదల కానుండగా.. ఆ వెంటనే జూన్ 18న తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం ‘చిన్న చిన్న ఆసై’ (Chinna Chinna Aasai) థియేటర్లలోకి రానుంది.
ఎప్పటికీ మరువలేను
సినీ ప్రేమికులకు మధు అనగానే 1990ల నాటి గోల్డెన్ డేస్ గుర్తుకొస్తాయి. బాలీవుడ్‌లో అజయ్ దేవగన్ సరసన 'ఫూల్ ఔర్ కాంటే' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం క్లాసిక్ మూవీ 'రోజా'తో ఆమె రేంజ్ మారిపోయింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత 'యోధా', 'జెంటిల్‌మన్', 'అల్లరి ప్రియుడు', 'దిల్‌జాలే', 'యశ్వంత్' వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పారు.
మనోజ్ బాజ్‌పాయ్‌తో ‘గవర్నర్’..
వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘గవర్నర్’ సినిమా గురించి మధు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో నా పాత్ర నిడివి కాస్త తక్కువైనా.. చాలా స్వీట్ గా, హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. ఒక ముఖ్యమైన, రొమాంటిక్, సాఫ్ట్ క్యారెక్టర్‌లో నేను కనిపిస్తాను. మనోజ్ బాజ్‌పాయ్ లాంటి పవర్‌హౌస్ పర్ఫార్మర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ సినిమా షూటింగ్ జర్నీ మొత్తం ఒక మ్యాజిక్‌లా సాగిపోయిందని ఆమె అన్నారు.
లైఫ్ చేంజింగ్ మూవీ
మరో చిత్రం ‘చిన్న చిన్న ఆసై’ (తమిళం, మలయాళం) గురించి మధు మరింత ఎమోషనల్ అయ్యారు. తన 30 ఏళ్ల సినీ కెరీర్‌లోనే ఇది అత్యుత్తమమైన చిత్రమని కొనియాడారు. ఈ సినిమా నా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు. షూటింగ్ కోసం మేము ఒక నెల రోజుల పాటు కాశీ, బనారస్ లలో నివసించాము. ఆ పవిత్ర పుణ్యక్షేత్రాలలో షూటింగ్ చేయడం, ఆ వాతావరణంలో గడపడం మాటల్లో చెప్పలేని అనుభూతి. నా కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫిలిం అని గర్వంగా చెబుతానని వివరించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు గోవింద్ వసంత అందించిన మ్యూజిక్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకువెళ్లిందని, పాటలు ఎంతో దైవికంగా, ఆధ్యాత్మికంగా ఉంటాయని ఆమె ప్రశంసించారు.
సరికొత్త రూపం!
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూడు దశాబ్దాలు దాటినా, మధు (Madhoo Shah) ఇప్పటికీ వైవిధ్యమైన పాత్రలతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ప్రేక్షకులు ఇప్పటికీ ఆమెను 'రోజా'లోని అమాయకపు పల్లెటూరి పిల్లిలా, 'ఫూల్ ఔర్ కాంటే' గ్లామరస్ క్వీన్‌లా గుర్తు పెట్టుకున్నప్పటికీ.. నటిగా తనకు అత్యంత సంతృప్తినిచ్చే వర్క్ ఇప్పుడే దొరుకుతోందని మధు నమ్ముతున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ కనెక్ట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు.
జూన్ 12న మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి వైవిధ్యమైన పాత్రలో, అలాగే జూన్ 18న కెరీర్‌లోనే బెస్ట్ అని చెప్పుకుంటున్న ఒక ఎమోషనల్ డ్రామాతో మధు ప్రేక్షకులను పలకరించనున్నారు. ‘రోజా’ కాలం నుంచి నేటి తరం వరకు ఆమె నటనను, అందాన్ని ఆరాధించే అభిమానులకు రాబోయే రెండు వారాలు థియేటర్లలో ఒక పండగలాంటి అనుభూతిని ఇవ్వడం ఖాయం.

