Sai Pallavi Reacts to Bollywood Entry: తన సహజ సిద్ధమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులను మాయం చేసిన నటి సాయి పల్లవి, ఇప్పుడు బాలీవుడ్ వెండితెరపై మెరవడానికి సిద్ధమయ్యారు. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి ఆమె నటించిన ఏక్ దిన్ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో ఇది తన తొలి సినిమా కావడంతో హిందీ ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందోనని సాయి పల్లవి కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. "నేను ఎన్ని మంచి సినిమాల్లో నటించానో తెలియదు కానీ, గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తులతో పని చేసే అవకాశం రావడం నా అదృష్టం" అని ఆమె పేర్కొన్నారు. హిందీ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నానని, ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని కోరుతూ తన వినమ్రతను చాటుకున్నారు. జునైద్ ఖాన్ చాలా మంచి సహనటుడని ఆమె కొనియాడారు.

సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఆమిర్ ఖాన్

ఈ సినిమా చూసిన తర్వాత బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ సాయి పల్లవి స్పందించారు. "సినిమా చూశాక ఆమిర్ సర్ అందరి ముందు ఎమోషనల్ అయ్యారు. ఆయనలా అందరి ముందు భావోద్వేగాన్ని చూపించాలన్నా ధైర్యం కావాలి. సినిమా చూస్తున్నప్పుడు నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి, కానీ కంట్రోల్ చేసుకున్నాను" అని ఆమె చెప్పుకొచ్చారు.

వసూళ్ల కంటే కథే ముఖ్యం: ఆమిర్ ఖాన్

ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన ఆమిర్ ఖాన్ సినిమా విజయంపై తనదైన శైలిలో స్పందించారు. బాక్సాఫీస్ వసూళ్ల కంటే కథకు ప్రాణం పోసి చూపించగలిగామా లేదా అన్నదే తనకు ముఖ్యమని ఆయన అన్నారు. "నచ్చని సినిమా బాగా ఆడి వసూళ్లు సాధించినా, ఆ విజయంతో నేను సంతోషంగా ఉండలేను. కానీ ఈ సినిమా విషయంలో మేం అనుకున్నది సాధించాం" అని దర్శకుడు సునీల్ పాండే పనితీరును అభినందించారు. మొత్తానికి జునైద్ ఖాన్ డెబ్యూ, సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీగా వస్తున్న ఈ ఏక్ దిన్ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story