Saif Ali Khan: మైదానంలో మెరిసిన సైఫ్ అలీ ఖాన్.. పేదరికంపై కామెంట్స్
ఇంగ్లాండ్‌లో జరిగిన చారిటీ క్రికెట్ మ్యాచ్‌లో మన్సూర్ అలీ ఖాన్ పటోడీ కుమారుడు, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) మెరిశారు.

ప్రముఖ భారత నటుడు సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన ఒక ప్రత్యేక చారిటీ క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. తెలుపు రంగు క్రికెట్ యూనిఫాంలో మైదానంలోకి దిగిన సైఫ్, మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి హాఫ్ సెంచరీ చేయడం విశేషం. ఈ మ్యాచ్ లూటన్ టౌన్ (Luton Town), ఇండియన్స్ క్రికెట్ క్లబ్ (Indians Cricket Club) మధ్య ఎంతో ఉత్సాహంగా జరిగింది.
ఈ మ్యాచ్‌లో సైఫ్ అలీ ఖాన్‌తో పాటు ఇంగ్లాండ్ మాజీ అంతర్జాతీయ క్రికెటర్ ఉస్మాన్ అఫ్జాల్, మాజీ స్పిన్ బౌలర్ మాంటీ పనేసర్ కూడా పాల్గొన్నారు. సైఫ్ తన కుమారులతో కలిసి ఈ మ్యాచ్ ఆడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రికెట్ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సైఫ్, మైదానంలో తన పాత రోజులను గుర్తుకు తెచ్చేలా షాట్లు ఆడారు.
అనుభవాన్ని పంచుకున్న సైఫ్ అలీ ఖాన్
ఈ మ్యాచ్ అనంతరం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ఎండకాంతిలో, తండ్రులు, కుమారులు కలిసి క్రికెట్ ఆడటం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. నా కుమారులకు ఇంగ్లాండ్ కంట్రీ వికెట్‌పై ఇది మొదటి మ్యాచ్ కావచ్చు. క్రికెట్ నేర్చుకోవడానికి, దాన్ని ఆస్వాదించడానికి ఇది ఒక చక్కని మార్గమని అన్నారు.
సమాజంలో చారిటీ, దయ ప్రాముఖ్యత గురించి సైఫ్ మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచంలో అన్ని వసతులు ఉన్నవారు కొందరైతే, ఏమీ లేనివారు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ దయ, దాతృత్వం, కరుణ వంటి మంచి గుణాలను మరింత ఎక్కువగా అలవర్చుకోవాలన్నారు. తోటివారికి సహాయం చేయడం మన బాధ్యత అని సైఫ్ స్పష్టం చేశారు.
రాబోయే సినిమాలు
సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన కొత్త చిత్రం 'హైవాన్' (Haiwaan) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రసిద్ధ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో సైఫ్ నటిస్తున్న మొదటి సినిమా ఇది కావడం విశేషం. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

