సయారా ట్రైలర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు.

యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సయారా’. ఈ మూవీతో అహాన్ పాండేని హీరోగా పరిచయం చేయనున్నారు. ఈ మూవీలో అనీత్ పడ్డా హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీకి సంబంధించిన పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. తాజాగా సయారా ట్రైలర్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా..
మోహిత్ సూరి మాట్లాడుతూ.. ‘అహాన్ పాండే, అనీత్ పద్దా వంటి అద్భుతమైన నటులు నాకు దొరకకపోతే నేను సయారా సినిమా చేసేవాడిని కాదు. ఒకానొక టైంలో డెబ్యూ ఆర్టిస్టుల్లో అద్భుతమైన టాలెంట్ కనిపించలేదు.. అలా కొత్త వారు ఎవ్వరూ కనిపించకపోతే ఈ మూవీని చేయకూడదని అనుకున్నాను. కానీ నాకు అహాన్, అనీత్ వంటి గొప్ప ఆర్టిస్టులు దొరికారు. కొత్త నటీనటులతో ప్రేమకథను నిర్మించేటప్పుడు వారి కెమిస్ట్రీకి, నటనకి ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండాలి.
సహజమైన భావోద్వేగాల్ని పండించాల్సి ఉంటుంది. కొత్త నటీనటులు రణబీర్ కపూర్, అలియా భట్ స్థాయి నటనను కలిగి ఉంటారని ఎవరూ ఆశించరు. కానీ వారు తెరపై తమదైన శైలిలో నటించే నటులుగా ఉండాలి. నటనా సామర్థ్యం ఉన్న డెబ్యూ నటీనటులను నేను చూడలేదు. అందుకే ఈ స్క్రిప్ట్‌ను తొలి నటీనటులతో రూపొందించాలనే ఆలోచనను నేను వదులుకున్నాను.
కమర్షియల్ కోణంలో ఆలోచించి నేను స్క్రిప్ట్‌ను కాస్త మార్చాను. అలా సయారా రచనా ప్రక్రియకు చాలా సమయం పట్టింది. ఆపై YRF వద్దకు వెళ్లాను. అహాన్, అనీత్ ఆడిషన్‌లను చూశాను. వారితో కొంత కాలం ట్రావెల్ చేశాను. ఈ ఇద్దరూ అద్భుతం చేశారు. కొత్తవారితో ప్రేమకథను రూపొందించడం చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. నేను ఈ కథను రూపొందించాలనుకున్న విధంగానే చేశాను. నాకు ఈ ఇద్దరూ దొరకడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
సైయారాను నిర్మిస్తున్న YRF CEO అక్షయ్ విధాని మాట్లాడుతూ.. ‘YRFలో ఎన్నో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ వచ్చాయి. కాబట్టి మరోసారి అలాంటి ఓ కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని అందించాలని మోహిత్ సూరితో ఈ మూవీని నిర్మించాం. నేటి యువతకు వారి భావాలు, భావోద్వేగాలు, నిబద్ధతలు ఎంత లోతుగా, నిజాయితీగా ఉన్నాయో చూపించడం ద్వారా వారికి కనెక్ట్ అయ్యే నిజమైన ప్రేమకథను చెప్పాలని మేము ప్రయత్నించాం.సయారా అద్భుతంగా వచ్చినందుకు మేం సంతోషిస్తున్నాం. ఇది సహజంగానే YRF బ్యానర్ నుంచి వచ్చే ఓ అందమైన ప్రేమకథ అని చెప్పుకోవచ్చు. డెబ్యూ ఆర్టిస్టులతో చేసిన ఈ ప్రేమ కథను ఆడియెన్స్ ఓ రిఫ్రెషింగ్‌గా భావిస్తారని మేం ఆశిస్తున్నామ’ని అన్నారు.
సయారా నుంచి ఫహీమ్-అర్స్లాన్ ఆలపించిన టైటిల్ ట్రాక్, జుబిన్ నౌటియాల్ పాడిన బర్బాద్, విశాల్ మిశ్రా గాత్రంలో వచ్చిన తుమ్ హో తో, సచేత్-పరంపర పాడిన హమ్‌సఫర్, అర్జిత్ సింగ్ , మిథూన్ కలిసి పాడిన ధున్ పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సయారా జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
