బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన బ్లాక్‌బక్ వేట కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయన జీవితంలోని వివాదాస్పద ఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతున్న "కాళా హిరణ్" చిత్రంపై సల్మాన్ ఖాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించి పని చేస్తున్న కాస్టింగ్ డైరెక్టర్ అక్షయ్ పాండేకు లీగల్ నోటీసు పంపించారు.


ముంబైకి చెందిన ప్రముఖ న్యాయ సంస్థ DSK లీగల్ ద్వారా జారీ చేసిన నోటీసులో, "కాళా హిరణ్" చిత్రం సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన బ్లాక్‌బక్ కేసును ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. చిత్ర నిర్మాణానికి సంబంధించి కథా సారాంశం, పాత్రల వివరాలు, ఇతర ప్రచార సామగ్రి ఇప్పటికే పరిశ్రమలో చక్కర్లు కొడుతున్నాయని ఆరోపించారు.

ప్రస్తుతం బ్లాక్‌బక్ కేసు రాజస్థాన్ హైకోర్టు పరిధిలో విచారణలో ఉన్నందున, ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని సినిమా రూపొందించడం న్యాయ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు. ఇది ప్రజల్లో ముందస్తు అభిప్రాయాలు ఏర్పడేలా చేసి, న్యాయ విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సల్మాన్ ఖాన్ తరఫు న్యాయవాదులు వాదించారు.

అలాగే, చిత్రంలోని పాత్రలు, కథనం, సంఘటనలు నేరుగా లేదా పరోక్షంగా సల్మాన్ ఖాన్‌ను సూచించేలా ఉన్నాయని, ఆయన అనుమతి లేకుండా వ్యక్తిత్వం, పేరు, ప్రతిష్ఠను ఉపయోగించడం వ్యక్తిగత గోప్యతా హక్కులు, పబ్లిసిటీ హక్కులు మరియు వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ చిత్రం ద్వారా సల్మాన్ ఖాన్‌పై తప్పుడు, అవమానకరమైన అభిప్రాయాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని, ఇది పరువు నష్టం కలిగించే చర్యగా భావిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. తమ క్లయింట్ సంపాదించుకున్న ప్రతిష్ఠ, గుడ్‌విల్‌కు నష్టం కలిగించే విధంగా ఈ ప్రాజెక్ట్ రూపొందుతోందని ఆరోపించారు.

నోటీసులో భాగంగా వెంటనే సినిమా నిర్మాణం, ప్రచారం వంటి కార్యకలాపాలను నిలిపివేయాలని, అలాగే సల్మాన్ ఖాన్‌కు బేషరతుగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నోటీసు అందిన 24 గంటల్లోగా స్పందించకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు నష్టపరిహారం కోసం కూడా చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించారు.

ప్రస్తుతం ఈ వివాదం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్ ఖాన్ అభ్యంతరాలపై "కాళా హిరణ్" చిత్ర బృందం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Updated On
Editor

Editor

Next Story