Salman Khan – Vamshi Paidipally Film Update: బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఒక మెగా ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ఇన్నాళ్లూ కేవలం ప్రచారానికే పరిమితమైన ఈ క్రేజీ కాంబో.. ఇప్పుడు పట్టాలెక్కింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే అధికారికంగా ప్రారంభమైంది.

అయితే, ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను వచ్చే ఏడాది ఈద్ (Eid 2027) కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సల్మాన్ ఖాన్, ఈద్ పండగకు ఉన్న విడదీయలేని బంధం గురించి మనందరికీ తెలిసిందే. అందుకే 2027 రంజాన్ పండగను సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వేటతో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.

రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'విడుదలకు చాలా రోజులుందని నిరాశపడకండి.. మీ ఎదురుచూపులకు తగినట్లుగానే ఈ సినిమా ఉంటుంది' అంటూ భాయ్‌జాన్ ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేశారు. అంటే, ఈ సినిమాలో సల్మాన్ నుండి ప్రేక్షకులు ఆశించే మాస్, క్లాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని అర్థమవుతోంది. ఇక ఈ సినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం మరో విశేషం. సల్మాన్-నయనతార జోడీ వెండితెరపై ఎలాంటి మేజిక్ చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వంశీ పైడిపల్లి మార్క్ ఎమోషన్స్, దిల్ రాజు నిర్మాణ విలువలు, సల్మాన్ ఖాన్ స్వాగ్.. ఇవన్నీ కలిస్తే థియేటర్లలో రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సల్మాన్ ఖాన్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరి 2027 ఈద్ రేసులో నిలబడబోతున్న ఈ 'సుల్తాన్' ప్రభంజనం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Next Story