ఖల్నాయక్ రిటర్న్స్.. బాలీవుడ్ కండల వీరుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. 1993లో విడుదలైన 'ఖల్నాయక్' సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సంచలనం. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘ఖల్నాయక్ రిటర్న్స్ (Khalnayak Returns)’ రూపొందుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంజయ్ దత్ తన సొంత బ్యానర్ త్రీ డైమెన్షన్ మోషన్ పిక్చర్స్, నిర్మాత అక్షా కాంబోజ్‌కు చెందిన అస్పెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంలో ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న సంజయ్ దత్, ఈ సినిమా పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యాన్ని పంచుకున్నారు.

జైలు గదిలో పుట్టిన ‘ఖల్నాయక్’ ఆలోచన

ఈ సినిమా ఆలోచన ఏదో స్టార్ హోటల్‌లో కూర్చుని చర్చించింది కాదని, అది తన చీకటి రోజుల్లో నుంచి పుట్టిందని సంజయ్ దత్ (Sanjay Dutt) వెల్లడించారు. తాను జైలులో ఉన్న సమయంలో తన తోటి ఖైదీలు తనను మళ్ళీ 'బల్లూ' వంటి పవర్‌ఫుల్ ఖల్నాయక్ పాత్రలో చూడాలని కోరుకున్నారట.

అంతేకాకుండా, వారు సంజయ్ దత్ కోసం దాదాపు 4000 పేజీల కథలను రాశారు. "వారందరూ రాసిన ఆ కథలను చదవడం కష్టమైనప్పటికీ, నేను ఓపిగ్గా చదివాను. అందులో ఒక కథ నన్ను బాగా ఆకట్టుకుంది. అదే ఈ ‘ఖల్నాయక్ రిటర్న్స్(Khalnayak Returns)’ చిత్రానికి పునాది వేసింది," అని సంజయ్ దత్ పేర్కొన్నారు.

జీవితాన్ని మార్చిన ఆ హవాల్దార్ మాట

సంజయ్ దత్ తన జైలు జీవితం గురించి మాట్లాడుతూ కొన్ని భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. జైలులో ఉన్నప్పుడు ప్రతిరోజూ "ఎప్పుడు బయటకు వెళ్తాను?" అన్న ఆత్రుతతో గడిపేవారట. ఆ సమయంలో ఒక హవాల్దార్ చెప్పిన మాట ఆయన ఆలోచనా దృక్పథాన్ని మార్చేసింది.

"బయటకు వెళ్లాలనే ఆశను ఎప్పుడైతే వదిలేస్తావో, అప్పుడే నువ్వు నిజంగా ప్రశాంతంగా ఉంటావు" - అని ఆ హవాల్దార్ సంజయ్ దత్‌తో అన్నారట.

ఆ మాట విన్న తర్వాత, సంజయ్ దత్ విడుదలపై ఆశలు వదులుకుని, జైలు జీవితాన్ని ఒక క్రమశిక్షణగా అంగీకరించారు. ఆ నిమిషం నుంచే ఆయనకు సమయం త్వరగా గడుస్తున్నట్లు అనిపించిందని, చివరకు విడుదల పిలుపు ఆయనే వెతుక్కుంటూ వచ్చిందని సంజు బాబా వివరించారు.

పాత జ్ఞాపకాలే కాదు.. కొత్త కథ!

'ఖల్నాయక్' తన కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమా అని, ఆ చిత్రంతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని సంజయ్ దత్ చెప్పారు. అయితే, సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. తాము కేవలం పాత సినిమా సెంటిమెంట్‌తోనే ముందుకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. నేటి తరం యువతకు, ప్రస్తుత కాలానికి సరిపోయే విధంగా సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తనలో వచ్చిన మార్పుల గురించి ప్రస్తావిస్తూ, "గతంలో కంటే ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా మారాను. జీవితంలోని ఎత్తుపల్లాలు నాకు ఎన్నో పాఠాలు నేర్పాయి. ఆ అనుభవమే నన్ను మరింత పరిణతి చెందిన నటుడిగా మార్చింది," అని అన్నారు.

అక్షా కాంబోజ్‌తో అనుబంధం

నిర్మాత అక్షా కాంబోజ్‌తో పనిచేయడంపై సంజయ్ దత్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమెను తన సొంత సోదరిగా భావిస్తానని, అస్పెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్‌తో కలిసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కమర్షియల్ సినిమాలను నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

మొత్తానికి.. 'బల్లూ' మళ్ళీ రాబోతున్నాడు! ఈసారి జైలు గదుల్లో పుట్టిన కథతో, సంజయ్ దత్ తన మార్కు నటనతో బాక్సాఫీస్ వద్ద మరోసారి మాయ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీక్వెల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

Lipika Varma

Lipika Varma

Next Story