Taapsee Pannu: చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య ఉండే వివక్ష, అసమానతలపై ప్రముఖ కథానాయిక తాప్సీ పన్ను మరోసారి గళం విప్పారు. కెరీర్ ప్రారంభ దశలో సినిమా సెట్స్‌పై తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, హీరోలకు ఇచ్చే అధిక ప్రాధాన్యతను ఆమె బహిర్గతం చేశారు. సినిమా షూటింగ్‌లలో హీరోయిన్లు కొన్ని గంటల ముందే సెట్‌కు చేరుకోవాల్సి వచ్చేదని తాప్సీ తెలిపారు.

హీరోయిన్ సెట్‌కు వచ్చి రెడీగా ఉందని అసిస్టెంట్ ఫోన్ చేసి సమాచారం ఇస్తేనే హీరోలు వచ్చేవారని, నటీనటులకు కేటాయించే రూమ్స్ విషయంలోనూ తీవ్ర వ్యత్యాసం ఉండేదని పేర్కొన్నారు.

హీరో కోసం ఇంట్రడక్షన్ సీన్ మార్పు

కెరీర్ ఆరంభంలో ఒక చిత్రంలో తన పాత్రకు సంబంధించి చిత్రీకరించిన అద్భుతమైన ఇంట్రడక్షన్ సీన్ నచ్చడంతోనే ఆ ప్రాజెక్ట్‌కు అంగీకరించానని తాప్సీ చెప్పారు. అయితే ఆ సీన్ తర్వాత అకస్మాత్తుగా మార్చేశారని, హీరో అభ్యంతరం వల్లే అలా చేశారని తనకు తర్వాత తెలిసిందని వెల్లడించారు. దీనిపై దర్శకుడిని నిలదీయగా.. ‘అన్ని విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకున్నా అంటూ నిర్లక్ష్యంగా బదులివ్వడం తనను షాక్‌కు గురిచేసిందని గుర్తుచేసుకున్నారు.

డైలాగ్ మార్చమంటే నో చెప్పా.. కానీ డబ్బింగ్ మార్చేశారు

అదే సినిమాలో హీరోను ఉద్దేశించి గో టు హెల్ అని చెప్పే డైలాగ్‌పై కూడా హీరో అభ్యంతరం వ్యక్తం చేశారని ఆమె పేర్కొన్నారు. డబ్బింగ్ సమయంలో దర్శకుడు ఆ పదాన్ని వాటెవర్ గా మార్చాలని కోరగా, తాను అందుకు పూర్తిగా నిరాకరించానని చెప్పారు. కావాలంటే ఆ డైలాగ్‌ను మ్యూట్ చేయండి కానీ, తప్పుగా డబ్బింగ్ చెప్పను అని తేల్చిచెప్పినట్లు తాప్సీ తెలిపారు. అయితే సినిమా విడుదలయ్యాక థియేటర్‌లో చూస్తే.. కేవలం ఆ ఒక్క డైలాగ్ కోసమే వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో వాయిస్ ఓవర్ చెప్పించి విడుదల చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story