బాలీవుడ్ యంగ్ బ్యూటీ శర్వరీ వాఘ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా ఆమె టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా తెరకెక్కిస్తున్న 'యే ప్రేమ్ మోహ్ లియా' చిత్రంలో నటిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, ప్రేమ, ఆధునిక ఆలోచనల మేళవింపుగా రాబోతున్న ఈ సినిమా విశేషాలను శర్వరీ తాజాగా పంచుకుంది. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే..



ఆయుష్మాన్ ఖురానాతో కొత్త పెయిర్.. సూరజ్ సర్‌తో వర్క్ ఎక్స్‌పీరియన్స్

"ఆయుష్మాన్ ఖురానా, నా కాంబినేషన్ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినిస్తుంది. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో అద్భుతంగా ఉంది. నేను ఇప్పటికీ నన్ను ఒక కొత్త నటిగానే భావిస్తాను, నాలో ఇంకా ఆ అమాయకత్వం, నేర్చుకోవాలనే తపన ఉన్నాయి. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకునే సూరజ్ బర్జాత్యా గారి వంటి దర్శకుడితో పనిచేయడం వల్ల మనలోనూ అదే ఉత్సాహం కలుగుతుంది. ఇక ఆయుష్మాన్ సెట్స్‌లోకి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తారు. ఆయనలో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. తక్కువ సినిమాల్లోనే ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నారు. ఒక క్లాసిక్ చిత్రంలో పూర్తి భారతీయ మూలాలున్న పాత్రలో ఆయుష్మాన్‌తో కలిసి నటించడం మంచి అనుభవం."

టైప్‌కాస్ట్ అవుతాననే భయం అస్సలు లేదు

"సూరజ్ సర్ సినిమాల్లోని హీరోయిన్ పాత్రలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అయితే అలాంటి పాత్రలు చేస్తే ఒకే తరహా ఇమేజ్‌కు పరిమితమవుతామేమో (టైప్‌కాస్ట్) అనే భయం నాకు అస్సలు లేదు. నిజానికి ఇలాంటి పాత్రలు మరిన్ని చేసే అవకాశం వస్తే అది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఈ పాత్రకు నేను చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఒక నటిగా నేను ఎంచుకునే కథలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. 'మహారాజ్', 'ఆల్ఫా' లేదా పీరియాడిక్ చిత్రం ‘మై వాపస్ ఆవుంగా’.. ఇలా ప్రతి సినిమాలో నా లుక్, ప్రజెంటేషన్ వేర్వేరుగా ఉంటాయి. సూరజ్ సర్ సినిమాల్లో నటించిన నటీమణులను ప్రేక్షకులు ఆ పాత్రలతోనే గుర్తుపెట్టుకుంటారంటే, ఆ పాత్రలను వారు అంతగా ప్రేమించారని అర్థం. ఆ ప్రేమ దక్కడం ఒక వరం."

సంప్రదాయాలను ప్రశ్నించే నేటి తరం అమ్మాయి పాత్ర

"ఈ సినిమాలో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. తనకు ఏం కావాలో ఆమెకు స్పష్టంగా తెలుసు, దానికోసం నిలబడే ధైర్యం కూడా ఉంది. తరతరాలుగా సమాజంలో వస్తున్న కొన్ని పాత ఆలోచనలను, సంప్రదాయాలను తన చుట్టూ ఉన్నవారు ప్రశ్నించేలా చేస్తుంది. అందుకే నేటి యువతకు ఈ పాత్ర చాలా దగ్గరగా అనిపిస్తుంది."

'యే ప్రేమ్ మోహ్ లియా' ఎందుకు ప్రత్యేకమంటే..

"మన కుటుంబ విలువలు, సంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే.. ఆ విలువలను ఒక కొత్త కోణంలో చూసేలా ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. అదే ఈ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. ప్రేక్షకులు తప్పకుండా ఈ కథకు కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను" అని శర్వరీ చెప్పుకొచ్చింది.

Next Story