రాజకీయాల్లో తన సూటి వ్యాఖ్యలు, డిబేట్లలో ఫ్యాక్ట్స్‌తో ఆకట్టుకున్న షెహజాద్ పూనావాలా ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. 'రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2' రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 26, 2026 నుంచి ఈ షో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా షెహజాద్ తన గేమ్ ప్లాన్, గెలుపు-ఓటమి, ఇతర రియాలిటీ షోలు, సినిమాల్లో నటించే అవకాశాలు, దక్షిణాది చిత్ర పరిశ్రమపై తన ఆసక్తి వంటి అంశాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.




గెలుపు కంటే ప్రజల మనసులు గెలవడమే ముఖ్యం

రియాలిటీ షోలో తన సూటితనం ఎలా ఉపయోగపడుతుందని అడిగిన ప్రశ్నకు షెహజాద్ స్పందిస్తూ.. గెలవడం, ఓడిపోవడం తనకు అత్యంత ముఖ్యమైన విషయం కాదన్నారు. తాను ఎవరో అదే విధంగా ప్రేక్షకుల ముందు కనిపించడమే తన లక్ష్యమని తెలిపారు.

డిబేట్లలో తాను తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం, హ్యూమర్‌తో పాటు వాస్తవాలను ప్రస్తావించడం వల్లే ప్రజలు తనను ఆదరిస్తున్నారని చెప్పారు. షోలోనూ అదే విధంగా ఫ్యాక్ట్స్‌కు ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు.

'ట్రోఫీ గెలవడం ఒక సంఘటన. కానీ ప్రజల మనసులు గెలవడం ఒక భావోద్వేగం. నేను ఈవెంట్స్‌ను కాదు.. ఎమోషన్స్‌ను గెలవాలనుకుంటున్నాను' అనే భావనను షెహజాద్ వ్యక్తం చేశారు.

ఫిక్స్‌డ్ స్ట్రాటజీ లేదు.. సెహ్వాగ్‌ను ఫాలో అవుతా!

'రైజ్ అండ్ ఫాల్' కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఫిక్స్‌డ్ స్ట్రాటజీ సిద్ధం చేసుకోలేదని షెహజాద్ చెప్పారు. పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు.

క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆటతీరును తనకు స్ఫూర్తిగా పేర్కొన్నారు. బంతి ఎలా వస్తే దానికి తగ్గట్టుగా సెహ్వాగ్ ఆడేవారని.. తాను కూడా షోలో పరిస్థితిని బట్టి స్పందిస్తానని చెప్పారు. ఫుల్ టాస్ వస్తే సిక్స్ కొడతానని, బౌన్సర్ వస్తే దానికి తగ్గట్టుగా స్పందిస్తానని నవ్వుతూ చెప్పారు.

బిగ్‌బాస్‌పై పెద్దగా చూడలేదన్న షెహజాద్

ఇటీవల ఇతర రియాలిటీ షోలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో 'బిగ్‌బాస్'పై మీ అభిప్రాయం ఏంటని అడగగా.. గత కొన్ని రోజులుగా టీవీ చూసే సమయం తనకు దొరకలేదని షెహజాద్ తెలిపారు.

తన మొదటి రియాలిటీ షో కావడంతో ఏం తీసుకెళ్లాలి, ఏం తీసుకెళ్లకూడదు, ఎంత ప్యాక్ చేసుకోవాలి వంటి విషయాలతోనే బిజీగా ఉన్నానని చెప్పారు.

సల్మాన్ ఖాన్‌పై ప్రశంసలు.. సెహ్వాగ్ హోస్టింగ్‌పై ఆసక్తి

సల్మాన్ ఖాన్ అద్భుతమైన వ్యక్తి అని, 'బిగ్‌బాస్' హోస్ట్‌గా ఆయన తనదైన శైలిలో ఆకట్టుకుంటారని షెహజాద్ అన్నారు. కొన్ని సామాజిక కార్యక్రమాల్లో సల్మాన్‌ను కలిశానని, ఆయనలో మంచి చారిజ్మా ఉందని చెప్పారు.

అదే సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ హోస్టింగ్ పూర్తిగా భిన్నంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. క్రికెట్‌లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా సెహ్వాగ్ సూటిగా, నో-నాన్సెన్స్‌గా ఉంటారని.. అదే లక్షణం హోస్టింగ్‌లోనూ కనిపించే అవకాశం ఉందన్నారు.

భవిష్యత్‌లో బిగ్‌బాస్‌లోకి వెళ్తారా?

భవిష్యత్‌లో బిగ్‌బాస్ వంటి మరో రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం వస్తే పరిశీలిస్తానని షెహజాద్ తెలిపారు. అయితే ముందుగా 'రైజ్ అండ్ ఫాల్' అనుభవాన్ని పూర్తిగా ఆస్వాదించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

తెలుగు సినిమాల్లో నటించేందుకు రెడీ!

రియాలిటీ షోతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్న షెహజాద్.. సినిమాల్లో నటించే అవకాశం వస్తే మాత్రం ఎందుకు కాదని అన్నారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు.

తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో అవకాశం వస్తే తప్పకుండా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి వచ్చిన పలువురు నటులు రాజకీయాల్లోనూ తమదైన ముద్ర వేశారని గుర్తుచేశారు.

తెలుగు నేర్చుకుంటా!

సౌత్ ఇండియన్ భాషలు ప్రస్తుతం తనకు పెద్దగా తెలియవని చెప్పిన షెహజాద్.. అవకాశం వస్తే తెలుగు, తమిళం లేదా కన్నడ భాషలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయికి ఎదిగిందని, 'RRR' అందుకు మంచి ఉదాహరణ అని పేర్కొన్నారు. అవసరమైతే సినిమా కోసం కొత్త భాష నేర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.

'నేను ఓపెన్ బుక్.. ఓపెన్ హార్ట్‌తో వస్తున్నా'

ఇతర కంటెస్టెంట్లకు షెహజాద్ ఆసక్తికరమైన సందేశం ఇచ్చారు. తాను ఓపెన్ బుక్ అని, ఓపెన్ హార్ట్‌తో షోలోకి అడుగుపెడుతున్నానని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా పాజిటివిటీ, హ్యాపీనెస్ పంచడమే తన ఉద్దేశమని తెలిపారు.

అయితే రియాలిటీ షోలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కోపం, ఫ్రస్ట్రేషన్, బాధ వంటి భావోద్వేగాలు కూడా బయటకు రావచ్చని చెప్పారు. తాను ఎలా స్పందిస్తానో ఇప్పుడే చెప్పలేనని.. షో చూస్తేనే తెలుస్తుందని అన్నారు.

గణపతి బప్పా ఆశీస్సులతో కొత్త ప్రయాణం

సెప్టెంబర్ 26న షోలోకి ఎంట్రీ ఇవ్వనున్న షెహజాద్.. అంతకుముందు వినాయకుడి ఆశీస్సులు తీసుకుంటానని చెప్పారు. సెప్టెంబర్ 25న గణపతి బప్పా నిమజ్జనం కావడం తనకు బాధగా ఉందని.. అయితే గణపతి ఎప్పుడూ తన హృదయంలో, మనసులో ఉంటారని అన్నారు.

షోలోకి వెళ్లే ముందు గణేశుడిని పూజించి ఆయన ఆశీస్సులు తీసుకుంటానని.. ఆ ఆశీస్సులు తన కొత్త ప్రయాణానికి బలం, పాజిటివిటీ ఇస్తాయని నమ్ముతున్నానని చెప్పారు. 'జై గణేష్.. గణపతి బప్పా మోరియా' అంటూ తన మాటలను ముగించారు.

బీజేపీకి రాజీనామా.. సిద్ధాంతాలు మాత్రం మారలేదన్న షెహజాద్

ఇక గతంలో బీజేపీకి రాజీనామా చేయడంపై వచ్చిన వార్తలపై కూడా షెహజాద్ స్పందించారు. పార్టీతో ఉన్న సమయంలో మీడియా నుంచి జీతం తీసుకునే అవకాశం లేకపోవడంతో తన పొదుపు మొత్తం ఖర్చయిపోయిందని తెలిపారు. మొదట మూడు, నాలుగేళ్లు పార్టీలో కొనసాగిన తర్వాత మళ్లీ ప్రైవేట్ రంగంలోకి వెళ్లాలని భావించినట్లు చెప్పారు.

బీజేపీ టికెట్ రాలేదనే కారణంతో పార్టీని వీడారన్న విమర్శలను ఆయన ఖండించారు. తాను ఎప్పుడూ టికెట్ అడగలేదని, ఎన్నికల్లో పోటీ చేయాలనే ప్రత్యేక ఆసక్తి కూడా తనకు లేదని చెప్పారు.

బీజేపీ తనకు 'నేషనలిస్ట్'గా గుర్తింపునిచ్చిందని, పార్టీపై తనకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని తెలిపారు. పరిస్థితులను బట్టి రెండు సంస్థలు లేదా వ్యక్తులు వేర్వేరు దిశల్లో వెళ్లడం అంటే తప్పనిసరిగా విభేదాలు లేదా ద్వేషం ఉన్నట్లు కాదని వివరించారు.

అంతేకాదు.. బీజేపీ నుంచి దూరమైనప్పటికీ తన సిద్ధాంతపరమైన అభిప్రాయాలు మారలేదని షెహజాద్ స్పష్టం చేశారు. తన ఐడియాలజీ ఇప్పటికీ బీజేపీతో సమానంగానే ఉందని పేర్కొన్నారు.

'హీల్ ఇన్ ఇండియా'పై ఫోకస్

మెడికల్ టూరిజం అంశాన్ని కూడా షెహజాద్ ప్రస్తావించారు. భారత్‌లో ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఇతర దేశాల్లో ఖరీదైన చికిత్సలు లేదా ఎక్కువ వెయిటింగ్ పీరియడ్స్ ఎదుర్కొనే వారికి భారత్ ఒక ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని చెప్పారు.

మెడికల్ టూరిజాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 'మేక్ ఇన్ ఇండియా'తో పాటు 'హీల్ ఇన్ ఇండియా' అనే దృక్పథాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

రాజకీయాల ద్వారా వ్యక్తిగతంగా ఎదిగానన్న షెహజాద్

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకు ఎక్కువ మంది వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశం లభించిందని షెహజాద్ తెలిపారు. జీవితంలో ప్రతి ప్లాట్‌ఫామ్ మనకు ఎదగడానికి ఒక అవకాశం ఇస్తుందని, రాజకీయాల ద్వారా తన పరిచయాలు విస్తరించడంతో కొత్త అవకాశాలు కూడా వచ్చాయని చెప్పారు.

ఇలా రాజకీయాలు, రియాలిటీ షో, సినిమాలపై తన ఆసక్తిని ఒకేసారి వెల్లడించిన షెహజాద్ పూనావాలా.. 'రైజ్ అండ్ ఫాల్ సీజన్ 2'లో ఎలాంటి గేమ్ ఆడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story