ముంబై : కన్నడ సూపర్‌స్టార్, 'OG' శివరాజ్‌కుమార్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'ఒరిజినల్ మాన్‌స్టర్'పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్ర టైటిల్‌ను ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత ఆనంద్ పండిట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్ సినిమా విశేషాలతో పాటు తన పాత్ర, దర్శకుడు చంద్రుతో అనుబంధం, 'జైలర్ 2', ముంబైపై తనకున్న ప్రేమ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

'ఒరిజినల్ మాన్‌స్టర్'కు కూడా హార్ట్ ఉంది!

'ఒరిజినల్ మాన్‌స్టర్' టైటిల్ చాలా ఇంటెన్స్‌గా అనిపించినా.. సినిమాలో తన పాత్రకు మరో కోణం ఉందని శివరాజ్‌కుమార్ చెప్పారు.

కథ విన్నప్పుడే తనకు చాలా ఆసక్తికరంగా అనిపించిందని, ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్‌ను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేసే సినిమా అని తెలిపారు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంతో పాటు జీవితం గురించి ఆలోచింపజేసే మెసేజ్ కూడా సినిమాలో ఉంటుందని చెప్పారు.

'విలన్ నేనే'.. కానీ చంద్రే అసలు విలన్!

సినిమాలో విలన్ ఎవరు అని అడిగినప్పుడు శివరాజ్‌కుమార్ నవ్వుతూ ''విలన్ నేనే!'' అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

ఇంకెవరైనా విలన్‌గా ఉన్నారా అని అడగ్గా.. ''భావన మేడమ్ కూడా ఉన్నారు'' అంటూ సస్పెన్స్ కొనసాగించారు. చివరికి ''నిజానికి చంద్రే అసలు విలన్. ఎందుకంటే నన్ను విలన్‌గా చేసింది ఆయనే'' అంటూ నవ్వించారు.

పోస్టర్‌లో ఉన్నదానికంటే కథలో చాలా ఉంది!

'ఒరిజినల్ మాన్‌స్టర్' ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. చేతిలో కత్తి, బైక్‌పై భారీగా డబ్బున్న బ్యాగ్‌తో కనిపిస్తున్న శివన్న లుక్‌పై స్పందిస్తూ.. పోస్టర్ ప్రేక్షకుల్లో ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తుందని చెప్పారు.

''డబ్బు ఎందుకు ఉంది? కత్తి ఎందుకు ఉంది? బైక్‌పై డబ్బున్న బ్యాగ్ ఎందుకు ఉంది? ఇలాంటి ప్రశ్నలే పాత్రపై ఆసక్తిని పెంచుతాయి. పోస్టర్‌లో కనిపించేదానికంటే కథలో చాలా ఎక్కువ ఉంది'' అన్నారు.

వైలెన్స్ మాత్రమే కాదు.. కామెడీ కూడా !

సినిమా చాలా వైలెంట్‌గా ఉంటుందా అన్న ప్రశ్నకు శివరాజ్‌కుమార్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

సినిమాలో హింస ఉన్నప్పటికీ.. పాత్ర ఎందుకు ఆ ప్రపంచంలోకి వెళ్లాల్సి వచ్చింది? ఎలాంటి పరిస్థితులు అతడిని ఆ దారిలోకి తీసుకెళ్లాయి? అనేదే అసలు సస్పెన్స్ అని చెప్పారు.

''లుక్ చాలా వైలెంట్‌గా కనిపించినా సినిమాలో హ్యూమర్, ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉన్నాయి. ప్రేక్షకులు ఊహించని సందర్భాల్లో నవ్వుతారు'' అని తెలిపారు.

చంద్రుతో మళ్లీ కాంబినేషన్

దర్శకుడు ఆర్. చంద్రుతో చాలా కాలం తర్వాత కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని శివరాజ్‌కుమార్ తెలిపారు.

''చంద్రు, నేను ఒకరి పని విధానాన్ని మరొకరం బాగా అర్థం చేసుకుంటాం. మా మధ్య మంచి అవగాహన, పరస్పర గౌరవం ఉన్నాయి. గతంలో 'కబ్జా'లో క్యామియో చేశాను. ఇప్పుడు 'ఒరిజినల్ మాన్‌స్టర్' కోసం మళ్లీ కలిశాం'' అని చెప్పారు.

ముంబై అంటే శివన్నకు అంత ఇష్టం!

దాదాపు 1986 నుంచి ముంబైతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని శివరాజ్‌కుమార్ తెలిపారు. భార్య గీతతో కలిసి పెళ్లి తర్వాత తొలిసారి ముంబైకి వచ్చానని, అప్పటి నుంచి షూటింగులు, ప్రమోషన్స్ కోసం తరచూ నగరానికి వస్తున్నానని చెప్పారు.

ముంబైలో హోటల్‌లో ఉండటం కంటే వీధుల్లో తిరగడం, జూహూ బీచ్‌లో వాకింగ్ చేయడం తనకు ఇష్టమని తెలిపారు. అంతేకాదు.. ముంబైకి వచ్చినప్పుడు పానీపూరీ తినడం తనకు చాలా ఇష్టమని చెప్పారు.

జూహూ బీచ్ పక్కన ఇల్లు ఇస్తే ఓకే..!

ముంబైలో ప్రాపర్టీ కొనుగోలు చేసే ఆలోచన ఉందా అని అడగ్గా.. శివన్న సరదాగా స్పందించారు.

''ఇక్కడే ఉండి మంచి సినిమాలు చేయడం బాగుంటుంది'' అన్నారు. ఆనంద్ పండిట్ జూహూ బీచ్ సమీపంలో ఇల్లు ఏర్పాటు చేస్తానని చెప్పిన విషయంపై.. ''ఇల్లు జూహూ బీచ్‌పైనే ఉంటే తప్పకుండా ఆలోచిస్తా'' అంటూ నవ్వించారు.

'జైలర్ 2'లోనూ శివన్న

తన క్రేజీ క్యామియో 'జైలర్ 2'లో ఉంటుందని శివరాజ్‌కుమార్ అధికారికంగా ధృవీకరించారు.

''అవును.. నేను 'జైలర్ 2'లో ఉన్నాను. కానీ ఇప్పుడే ఎక్కువ విషయాలు చెప్పను. సినిమా అక్టోబర్‌లో వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు వెయిట్ చేయాలి'' అని అన్నారు.

'KGF'తో కన్నడ సినిమాకు గ్లోబల్ గుర్తింపు

'KGF' వంటి సినిమాల విజయంతో కన్నడ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడం పట్ల శివరాజ్‌కుమార్ గర్వం వ్యక్తం చేశారు.

''కన్నడ సినిమా చాలా మంచి స్థాయికి చేరుకుంది. 'KGF' వంటి సినిమాలు మన ఇండస్ట్రీకి గ్లోబల్ ఐడెంటిటీ తీసుకొచ్చాయి. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కన్నడ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుండటం చాలా ఆనందంగా ఉంది'' అని అన్నారు.

సెప్టెంబర్ 7 నుంచి షూటింగ్.. బాలీవుడ్ స్టార్ ఎవరు?

'ఒరిజినల్ మాన్‌స్టర్' రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. అదే సమయంలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడిని సినిమాలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు శివరాజ్‌కుమార్ వెల్లడించారు.

అయితే ఆ బాలీవుడ్ స్టార్ ఎవరనే విషయాన్ని మాత్రం ఇప్పుడే వెల్లడించలేదు.

''ఆ సర్‌ప్రైజ్‌ను త్వరలోనే రివీల్ చేస్తాం. అప్పటివరకు వెయిట్ చేయండి'' అంటూ శివన్న సస్పెన్స్‌లో పెట్టారు.

ఓపెన్ మైండ్‌తో సినిమా చూడండి!

'ఒరిజినల్ మాన్‌స్టర్'ను ఎలాంటి ముందస్తు అంచనాలు లేకుండా ఓపెన్ మైండ్‌తో చూడాలని శివరాజ్‌కుమార్ ప్రేక్షకులను కోరారు. ఈ సినిమా పూర్తిగా ఎంటర్‌టైన్ చేయడంతో పాటు.. జీవితానికి సంబంధించిన ఓ అర్థవంతమైన సందేశాన్ని కూడా అందిస్తుందని తెలిపారు.

Next Story