జుహూలోని నివాసం బయట నాలుగు రౌండ్లు… భద్రత కట్టుదిట్టం

ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టీ నివాసం వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటి బయట ఆదివారం తెల్లవారుజామున నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాల్పుల ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఈ దాడి వెనుక కారణం ఇప్పటివరకు తెలియరాలేదు. ఘటన అనంతరం రోహిత్ శెట్టీ నివాసం చుట్టూ భద్రతను భారీగా పెంచారు. భవనం బయట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో రోహిత్ శెట్టీ ఇంటి బయట భారీగా పోలీసు సిబ్బంది, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. అప్రమత్తత చర్యలుగా పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ ఘటనపై ముంబై పోలీసులు ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దర్యాప్తు కోసం మొత్తం 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ బృందాలు కూడా ఘటన స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయి.

ఈ కాల్పుల ఘటన ముంబైలో భద్రతాపరమైన ఆందోళనకు దారి తీసింది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతూ, దాడికి బాధ్యులైన వారిని త్వరలోనే గుర్తిస్తామని తెలిపారు.

Lipika Varma

Lipika Varma

Next Story