Shyam’s Sensational Comments: కోలీవుడ్ సూపర్ స్టార్.. కోట్లాది మంది అభిమానుల 'దళపతి' విజయ్, వెండితెరపైనే కాదు, రాజకీయ రణక్షేత్రంలోనూ తన సత్తా చాటారు. తమిళనాడు రాజకీయాల్లో ఆయన సాధించిన ఘన విజయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే విజయ్ సాధించిన ఈ విజయాన్ని తాను రెండేళ్ల క్రితమే ఊహించానని అంటున్నారు నటుడు శ్యామ్.

'వారసుడు' సినిమాలో విజయ్‌కు సోదరుడిగా నటించిన శ్యామ్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు పంచుకున్నారు. "నిజం చెప్పాలంటే, ఈ విజయాన్ని నేను 2024లోనే ఊహించాను. ఒకరోజు ఉదయం విజయ్ అన్నకు ఫోన్ చేసి.. 'అన్నా, మీరు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్లు, ప్రజలందరూ మిమ్మల్ని గౌరవిస్తున్నట్లు నాకు కల వచ్చింది' అని చెప్పాను" అంటూ శ్యామ్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

విజయ్ విజయం వెనుక ఏదో ఒక అదృశ్య దైవశక్తి ఉందని శ్యామ్ బలంగా నమ్ముతున్నారు. "మే 3వ తేదీన కూడా నా కల నిజం కాబోతోందని అన్నకు మెసేజ్ చేశాను. ఆ రాజకీయ సింహాసనం ఆయనకే చెందుతుందని నాకు మొదటి నుంచీ నమ్మకం ఉంది. ఎందుకంటే, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, అంతటి స్టార్‌డమ్‌ను వదులుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి రావడం అందరికీ సాధ్యం కాదు. అది కేవలం విజయ్ అన్నకే చెల్లింది" అని శ్యామ్ ప్రశంసల వర్షం కురిపించారు.

విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ఆయన వ్యక్తిత్వం గురించి శ్యామ్ గొప్పగా చెప్పారు. "విజయ్ అన్న ఎంతో నిబద్ధత గల వ్యక్తి. ఆయన నిరాడంబరత చూసి నేను ఆశ్చర్యపోతుంటాను. ఒకసారి నేను మీరు ఇంతటి స్టార్ అవుతారని అనుకున్నారా? అని అడిగితే.. 'నేను కేవలం హీరో అయితే చాలు అనుకున్నాను, ఇంతటి ప్రేమాభిమానాలు పొందుతానని ఎప్పుడూ ఊహించలేదు' అని అన్న ఎంతో వినమ్రంగా చెప్పారు" అని శ్యామ్ వెల్లడించారు. అభిమానుల నుంచి పొందిన ప్రేమను తిరిగి ఇవ్వడానికే విజయ్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన నాయకత్వంలో తమిళనాడు కొత్త పుంతలు తొక్కుతుందని శ్యామ్ ధీమా వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story