Manchu Lakshmi: మౌనమే ఉత్తమం.. కుటుంబ సమస్యలపై మంచు లక్ష్మి స్పందన..
కుటుంబ సమస్యలపై మంచు లక్ష్మి స్పందన..

Manchu Lakshmi: ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి తమ కుటుంబంలో నెలకొన్న విభేదాలపై తాజాగా స్పందించారు. ఈ నెల 19న విడుదల కానున్న తన చిత్రం దక్ష ప్రమోషన్స్‌లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను పంచుకున్నారు. ప్రతి కుటుంబంలోనూ సమస్యలు సహజమని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులందరూ బాధపడతారని ఆమె అన్నారు.
అద్దాల మేడలో ఉన్నాం
తాము 'అద్దాల మేడలో' ఉంటున్నామని, తాము మాట్లాడిన ఏ విషయాన్నైనా వక్రీకరించి రాసుకునే పరిస్థితులు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే ఇలాంటి విషయాలపై మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే మంచిదని తాను భావించినట్లు మంచు లక్ష్మి తెలిపారు. తమ కుటుంబ వ్యవహారాలపై మీడియాకు దూరంగా ఉండటానికి ఇదే కారణమని ఆమె స్పష్టం చేశారు.
మనోజ్ విజయాన్ని ఆస్వాదిస్తున్నాను
కుటుంబంలో ఎవరైనా విజయం సాధిస్తే తాను సంతోషిస్తానని లక్ష్మి చెప్పారు. తన సోదరుడు మనోజ్ నటించిన మిరాయ్ సినిమా విజయాన్ని తాను కూడా ఎంతో ఆస్వాదిస్తున్నానని తెలిపారు. ఒకరి కష్టం వృథా కావాలని తాను ఎన్నడూ కోరుకోనని, సినీ రంగంలో ఉండే కష్టాలు ఒక కళాకారిణిగా తనకు తెలుసునని చెప్పారు. తన కుటుంబ సభ్యులకు ఒక ఆర్టిస్ట్‌గా సలహాలు ఇస్తుంటానని ఆమె తెలిపారు.
