Rahul Sipligunj : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు రూ. కోటి నజరానా
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాదీ టాలీవుడ్ ఫ్యామస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరాను ప్రకటించింది. బోనాల పండుగ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు ఈ కోటి రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్లైంది. పాత బస్తీ కుర్రాడిగా మెదలైన రాహుల్ సిప్లిగంజ్ ప్రస్ధానం ట్రిపుల్ ఆర్ సినిమాలో పాడిన నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్ధాయిలో ఆస్కార్ వేదిక వరకూ వెళ్లింది. సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో రాహుల్ ని ప్రశంసించారు. 2023లో జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో కూడా అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సహాయం ప్రకటిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం తరపున కోటి రూపాయాల నగదు పురస్కారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన గద్దర్ అవార్డుల వేదిక మీద కూడా సీయం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ విషయాన్ని ప్రస్తావిస్తూ త్వరలోనే అతనికి ఇచ్చిన హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఆమేరకు ఆదివారం పాతబస్తీ బోనాల పండుగ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ కు రూ. కోటి నగదు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
