'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రంతో ఆకట్టుకున్న స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్‌ పేరెపు కలయికలో మరో సినిమా రాబోతుంది. ఈసారి వారు 'బ్యాడాస్' అనే విభిన్న చిత్రం కోసం చేతులు కలిపారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సిద్ధును మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

సిద్ధు జొన్నలగడ్డ మంచి నటుడే కాకుండా, ప్రతిభగల రచయిత కూడా అనే విషయం తెలిసిందే. 'బ్యాడాస్' సినిమాకి రవికాంత్ పేరేపుతో పాటు సిద్ధు జొన్నలగడ్డ రచయితగా వ్యవహరిస్తున్నారు. రవికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. టిల్లు పాత్రతో వినోదాన్ని పంచి, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ఇప్పుడు 'బ్యాడాస్'లో కొత్తగా కనిపించబోతున్నారు. మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించడమే కాకుండా.. లోతైన మరియు పరిణతి చెందిన నటనతో మెప్పించబోతున్నారు.

నిర్మాతలు టైటిల్ తో కూడిన అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. “If middle finger was a man” అనే బోల్డ్ స్టేట్మెంట్ తో ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజుల్లో సినిమాకి సంబంధించిన మొదటి కంటెంట్ తోనే ప్రేక్షకులను ఆకర్షించడం అంత సులభమైన విషయం కాదు. కానీ, 'బ్యాడాస్' చిత్ర బృందం మొదటి ప్రయత్నంలోనే అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు, ప్రశంసలు అందుకుంటోంది.

బలమైన కథ, భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న 'బ్యాడాస్' చిత్రం పరిమితులను అధిగమించి సంచలన విజయం సాధిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. ఈ చిత్రం 2026లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎమోషనల్ డ్రామాలలో ఒకటిగా సిద్ధమవుతోంది. 'బ్యాడాస్' చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డతో 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి ఘన విజయాల తర్వాత వారి నిర్మాణంలో వస్తున్న ముచ్చటగా మూడో చిత్రమిది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Updated On 15 Aug 2025 2:59 PM IST
Politent News Web3

Politent News Web3

Next Story