Siva Krishna Makes Sensational Claim: చిరంజీవి కంటే నాకే ఎక్కువ హిట్స్..సీనియర్ నటుడు శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సీనియర్ నటుడు శివకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Siva Krishna Makes Sensational Claim: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఒక అజేయమైన ప్రభంజనం. కానీ, ఇటీవల సీనియర్ నటుడు శివకృష్ణ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. "ఆరంభంలో చిరంజీవి కంటే నాకే ఎక్కువ హిట్స్ ఉన్నాయి.. ఇదే పచ్చి నిజం" అంటూ శివకృష్ణ బాంబు పేల్చారు. అసలు మెగాస్టార్ కంటే తానే పెద్ద స్టార్ నంటూ ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ ఫ్లాష్‌బ్యాక్ ఏంటి?
నిజానికి 1970ల చివరలో చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారు. చిన్న పాత్రలు, విలన్ రోల్స్ కూడా చేశారు. కానీ అదే సమయంలో శివకృష్ణ వరుస యాక్షన్ హిట్స్‌తో మాస్ హీరోగా ఒక ఊపు ఊపారు. సరిగ్గా ఈ పాయింట్ గురించే శివకృష్ణ మాట్లాడుతూ.. "మా కెరీర్ల ప్రారంభంలో చిరంజీవి కంటే నాకే ఎక్కువ హిట్స్ ఉన్నాయి. నేను చాలా త్వరగా హీరోగా సెటిలై సక్సెస్ అయ్యాను. అప్పట్లో నా మార్కెట్, నా సక్సెస్ రేట్ చిరంజీవి కంటే చాలా ఎక్కువ" అని కుండబద్దలు కొట్టారు.
అయితే, శివకృష్ణ కేవలం గొప్పలు చెప్పుకోడానికే పరిమితం కాలేదు. తను చేసిన తప్పులేంటో కూడా అంతే ఓపెన్‌గా ఒప్పుకున్నారు. డూప్ లేకుండా ఫైట్స్ చేస్తూ కమర్షియల్ క్రేజ్ సంపాదించుకున్నా.. తాను కొన్ని రకాల పాత్రలకే పరిమితమయ్యానని తెలిపారు. "నేను అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ తిరగలేదు, నచ్చని పాత్రలను రిజెక్ట్ చేశాను. కానీ చిరంజీవి అలా కాదు.. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ, తనను తాను మలుచుకుంటూ ముందుకు సాగారు" అని చిరు స్మార్ట్ వర్క్‌ను కొనియాడారు.
ప్రేక్షకుల నాడిని పసిగట్టడంలో తాను లేట్ అయ్యానని, కానీ చిరంజీవి ఆ నాడిని ముందే పట్టుకుని ఇండస్ట్రీకి కావాల్సిన 'నెంబర్ 1' స్టార్‌గా ఎదిగారని శివకృష్ణ విశ్లేషించారు. ఒక నటుడికి ఉండాల్సిన అసలైన కసి చిరంజీవిలో పుష్కలంగా ఉందని, అందుకే ఆయన ఇవాళ శిఖరాగ్రాన ఉన్నారని చెప్పారు.

