“ఐ యామ్ పీస్‌మేకర్” అనే పరిచయంతో బిలియనీర్స్ ఫర్ పీస్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న నటుడు, సేవా స్వభావి సోనూ సూద్ తన సినీ ప్రయాణం, కోవిడ్ సమయంలో చేసిన సేవలు, సమాజం పట్ల తన బాధ్యత, కొత్త సినిమాలు, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ బాధిత మహిళలకు చేస్తున్న సహాయం గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

“దేవుడే ఒకే ఆలోచనలున్న వారిని కలుపుతాడు”:

బిలియనీర్స్ ఫర్ పీస్ కాన్‌క్లేవ్‌తో తన అనుబంధం గురించి సోనూ సూద్ మాట్లాడుతూ,“మనుషుల జీవితాలను మార్చాలని, సమాజానికి సహాయం చేయాలని భావించే వారు ఒకచోట చేరితే అద్భుతాలు జరుగుతాయి. దేవుడే అలాంటి వారిని కలుపుతాడు. ఇది ఒక గొప్ప ప్రయాణానికి ఆరంభం మాత్రమే” అని అన్నారు.

“కోవిడ్ సమయంలో మొదలైన ప్రయాణం ఇంకా కొనసాగుతోంది”:

కోవిడ్ సమయంలో కోట్లాది మందికి సహాయం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, “అప్పుడు బస్సులు, ట్రైన్లు, విమానాలు ఎలా ఏర్పాటు చేశామో కూడా తెలియదు. కానీ ప్రయత్నం ఆపలేదు. ఎన్ని సార్లు విఫలమైనా మళ్లీ ప్రయత్నిస్తే జీవితం దారి చూపిస్తుంది” అని తెలిపారు. అలాగే, “ఈరోజు కూడా ప్రతి రోజూ వందలాది మంది నా ఇంటి ముందు సహాయం కోసం వస్తుంటారు. ఎవరికైనా సర్జరీ చేయించడం, విద్యకు సహాయం చేయడం, ఉద్యోగం ఇప్పించడం — ఇలా ప్రతి రోజు ప్రజల నుంచి నేను కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను” అని చెప్పారు.

“ప్రజలతో కనెక్ట్ అవ్వడం జీవితంలో గొప్ప అనుభవం”:

“చాలాసార్లు ఒకరి సమస్యను ఓపికగా వినడమే వారికి పెద్ద సహాయం అవుతుంది. కొన్నిసార్లు ఒక నిజమైన ఫోన్ కాల్‌ ఒకరి జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతి కేసు సక్సెస్ కాకపోయినా, కొన్నిసార్లు దేవుడే మార్గం చూపిస్తాడు” అని సోనూ పేర్కొన్నారు.

“సినిమా కంటే ఒకరి జీవితాన్ని కాపాడటం గొప్పది”:

తన సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ, “ఇంజినీరింగ్ పూర్తి చేసి ముంబైకి వచ్చినప్పుడు నటుడిగా పేరు సంపాదించాలనేదే నా కల. కానీ తర్వాత తెలిసింది ఏమిటంటే, ఒకరి జీవితాన్ని కాపాడటం లేదా ఒక అవసరంలో ఉన్న వ్యక్తికి సంతోషం ఇవ్వడం బాక్సాఫీస్ కంటే ఎంతో గొప్పది” అని భావోద్వేగంగా చెప్పారు.

“ఇప్పటి సినిమాల్లో భారతీయత తగ్గిపోతోంది”:

హిందీ సినిమా పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులపై మాట్లాడుతూ, “ప్రేక్షకులు ఇప్పుడు చాలా తెలివైనవారు. మంచి కథ, బలమైన కంటెంట్ ఉండాలి. కానీ కొన్నిసార్లు పూర్తి స్క్రిప్ట్ లేకుండానే సినిమాలు ప్రారంభమవుతున్నాయి. సినిమాకు నిజాయితీ, కష్టపడి చేసే ప్రీ-ప్రొడక్షన్ చాలా అవసరం” అని అభిప్రాయపడ్డారు.

‘ఫతేహ్’ తర్వాత ‘నంది’కి దర్శకత్వం:

తన తదుపరి ప్రాజెక్టుల గురించి వెల్లడిస్తూ, “ఫతేహ్ తర్వాత నేను ‘నంది’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాను. అక్టోబర్ లేదా నవంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. గత నాలుగు నుంచి ఐదు నెలలుగా ప్రిపరేషన్ జరుగుతోంది” అని తెలిపారు.

బ్రెస్ట్ క్యాన్సర్ బాధిత మహిళలకు ఉచిత శస్త్రచికిత్సలు:

సమాజ సేవలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధిత మహిళలకు చేస్తున్న సహాయం గురించి మాట్లాడుతూ, “నాలుగున్నరేళ్లలో దాదాపు 650 శస్త్రచికిత్సలు చేయించాం. భారతదేశంలో ఎక్కడి మహిళ అయినా బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ అవసరమైతే ముంబైకి రావచ్చు. పూర్తిగా ఉచితంగా ఆపరేషన్ చేయిస్తాం” అని సోనూ సూద్ హామీ ఇచ్చారు.

Lipika Varma

Lipika Varma

Next Story