Sonu Sood: నటుడు సోనూసూద్ విమానాశ్రయాలు, హోటళ్లలో పనిచేసే సిబ్బంది సంక్షేమంపై మరోసారి స్పందించారు. గంటల తరబడి నిలబడి విధులు నిర్వహించే ఉద్యోగులకు కూర్చుని విశ్రాంతి తీసుకునే సౌకర్యం కల్పించాలని విమానాశ్రయ అధికారులు, హోటల్ యాజమాన్యాలను ఆయన కోరారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిప్రాయాలు వెలిబుచ్చారు.


‘‘విమానాశ్రయ కౌంటర్లు, హోటల్ రిసెప్షన్లు, సర్వీస్ డెస్క్‌ల వద్ద పనిచేసే సిబ్బంది 10 నుంచి 12 గంటల పాటు నిలబడి విధులు నిర్వహించడం మనం చూస్తూనే ఉంటాం. వారు చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ సేవలు అందిస్తారు. కానీ ఇన్ని గంటలు నిలబడటం వల్ల కలిగే శారీరక అలసట ఎంత తీవ్రమైనదో ఎప్పుడైనా ఆలోచించామా?’’ అని సోనూసూద్ ప్రశ్నించారు.


‘‘ఇలాంటి పని ప్రదేశాల్లో తప్పనిసరిగా ఎత్తైన స్టూల్ లేదా సరియైన కుర్చీ ఏర్పాటు ఉండాలి. ఉద్యోగులు కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించాలి. హాస్పిటాలిటీ రంగం అంటే ప్రజలకు సౌకర్యం అందించడం. మరి మనకు సేవలు అందించే వారి పట్ల కూడా అదే శ్రద్ధ, అదే గౌరవం చూపించకూడదా?’’ అని ఆయన యాజమాన్యాలను సూటిగా అడిగారు.


సోనూసూద్ ఈ విజ్ఞప్తి ద్వారా సాధారణ ఉద్యోగుల సమస్యలపై మరోసారి దృష్టి సారించారు. వారి శారీరక ఆరోగ్యం, సౌకర్యం పట్ల అధికారులు, యాజమాన్యాలు స్పందించాలని ఆయన సందేశం స్పష్టంగా ఉంది.

Next Story