Sreeleela Explains: స్థానిక భాషలోనే ఎందుకు మాట్లాడతానో చెప్పిన శ్రీలీల!
ఎందుకు మాట్లాడతానో చెప్పిన శ్రీలీల!

Sreeleela Explains: కథానాయిక శ్రీలీల ప్రాంతీయ భాషల ప్రాముఖ్యత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తను షూటింగ్‌లు లేదా సినిమా ప్రమోషన్ల కోసం ఏ ప్రాంతానికి వెళ్లినా, అక్కడ స్థానిక భాషలోనే మాట్లాడటానికి ఎందుకు ప్రయత్నిస్తారో ఈ బ్యూటీ పంచుకున్నారు.
శ్రీలీల తన నటనా ప్రస్థానాన్ని కన్నడ చిత్ర పరిశ్రమతో ప్రారంభించి, ఆ తర్వాత తెలుగు సినిమాలో అపారమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం తమిళ చిత్రాల్లోనూ అడుగుపెట్టిన ఈమె.. ఈ ఏడాది తన మొదటి హిందీ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నారు. నిజానికి శ్రీలీల తెలుగు మాట్లాడే కుటుంబం నుండి వచ్చినప్పటికీ.. ఆమెకు మాతృభాష తెలుగే కాకుండా ఇంగ్లీష్, హిందీ, కన్నడ భాషల్లో మంచి పట్టు ఉంది. అలాగే తమిళంలోనూ చక్కగా మాట్లాడగలరు. ఇలా బహుభాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండటం వల్లే ఆమె పలు చిత్ర పరిశ్రమల్లో సులభంగా అవకాశాలు దక్కించుకుంటున్నారు.
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ బిజీ స్టార్స్‌లో ఒకరిగా ఉన్న శ్రీలీల.. స్థానిక భాషలో మాట్లాడటం అనేది ఆ ప్రాంత ప్రజలకు, వారి సంస్కృతికి తాను ఇచ్చే గౌరవమని పేర్కొన్నారు. "నేను విభిన్న చిత్ర పరిశ్రమల్లో పని చేయడం వల్ల చాలా ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తుంది. నేను ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ స్థానిక భాషలోనే మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఇది ఆ ప్రజలకు, వారి సంస్కృతికి మరియు వారి భాషకు గౌరవం ఇవ్వడానికి నేను చేసే ప్రయత్నం" అని ఆమె చెప్పారు.
భాష అనేది నటీనటులకు, ప్రేక్షకులకు మధ్య ఒక భావోద్వేగ వారధిలా పనిచేస్తుందని శ్రీలీల నమ్ముతారు. సినిమా ప్రమోషన్ ఈవెంట్లలో స్థానిక భాషలో మాట్లాడటం వల్ల అభిమానులకు మరింత దగ్గరవ్వచ్చని, అలాగే ఆ సంభాషణలు మరింత అర్థవంతంగా మారుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. శ్రీలీల ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ సరసన ఒక హిందీ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. అలాగే స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

