Sreeleela: తెలుగు సినిమాల్లో ఇప్పటికే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల. ఇండస్ట్రీలో చాలా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆమెపై తమిళం, బాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టి కూడా పడింది. ఇప్పటికే శ్రీలీల రెండు తమిళ సినిమాల్లో నటించింది.

అయితే బాలీవుడ్‌లో ఆమె చేసే మొదటి సినిమా మాత్రం రెండేళ్ల క్రితమే సైన్ చేసింది. అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్, నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాదికి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

ఈ హిందీ సినిమాలో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఇదే ఆమెకు బాలీవుడ్ డెబ్యూ సినిమా. మొదట ఈ సినిమాకు ‘ఆషికీ 3’ అనే టైటిల్ ఉండొచ్చనే వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘టూ మేరీ జిందగీ హై’ అనే టైటిల్‌ను పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అనురాగ్ బసు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 30న థియేటర్లలోకి రానుంది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ రిలీజ్ డేట్‌తో మరింత ఆసక్తి పెరిగింది.

Next Story