Sreenu Vaitla: ల్యాండ్ స్కాం.. డైరెక్టర్ శ్రీనువైట్లకు రూ. కోటి టోకరా
డైరెక్టర్ శ్రీనువైట్లకు రూ. కోటి టోకరా

Sreenu Vaitla: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల భూమి కొనుగోలు వ్యవహారంలో నిలువునా మోసపోయారు. వికారాబాద్ జిల్లాలో విలువైన వ్యవసాయ భూమిని కొనుగోలు చేయాలనుకున్న ఆయనకు.. ఏకంగా 12 మంది కలిసి భారీ స్కెచ్ వేశారు. సుమారు 7 కోట్ల రూపాయల విలువైన భూమిని తమదేనని నమ్మించి, ఆయన నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
వికారాబాద్ జిల్లా కాద్మూర్ గ్రామంలోని 4 ఎకరాల 36 గుంటల భూమి తమదేనంటూ రంగంలోకి దిగిన నిందితులు ప్రభాకర్ రెడ్డి, ఆనందం, ఆగిరెడ్డి సహా మరో పదిమంది శ్రీను వైట్లతో ఒప్పందం చేసుకున్నారు. వారి మాటలను నమ్మిన దర్శకుడు శ్రీను వైట్ల.. అడ్వాన్స్ రూపంలో దాదాపు ఒక కోటి రూపాయలను వారికి చెల్లించారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో, ఈ భూమి వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. ఇటీవల జరిగిన కోర్టు విచారణలో అసలు విషయం బయటపడింది. ఆ భూమి నిందితుల పేరు మీద లేదని, అది ఇతరుల ఆస్తి అని తేలడంతో శ్రీను వైట్ల ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తాము మోసపోయామని గ్రహించిన ఆయన వెంటనే న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు.ఈ మోసంపై శ్రీను వైట్ల హైదరాబాద్ సిసిఎస్ (CCS) పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులుగా ఉన్న ప్రభాకర్ రెడ్డి, ఆనందం, ఆగిరెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జగన్ రెడ్డి, పల్లె మైసమ్మ, మహేశ్వర్ రెడ్డి, సుశీల, రామచంద్రయ్య, సుధాకర్ రెడ్డి, కృష్ణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

