‘Sharanagati’: శ్రీల ప్రభుపాదుల జీవితగాథకు ఏఐ యానిమేషన్ రూపం.. ‘శరణాగతి’గా 2027లో విడుదల
2027లో విడుదల

‘Sharanagati’: హోంబలే ఫిల్మ్స్ మరోసారి భారతీయ సినిమాకు కొత్త మార్గం చూపిస్తోంది. ‘కెజీఎఫ్’, ‘సలార్’, ‘కాంతార’ వంటి పాన్ ఇండియా విజయాలతో పాటు విభిన్న కథలను తెరపైకి తీసుకొచ్చిన ఈ సంస్థ, ఇప్పుడు అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో ఒక యానిమేషన్ చిత్రాన్ని రూపొందిస్తోంది. ‘శరణాగతి – ది లైఫ్ ఆఫ్ ఎ సరెండర్డ్ సోల్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) వ్యవస్థాపక ఆచార్యులు హిస్ డివైన్ గ్రేస్ ఏ.సి. భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల అసాధారణ జీవితం, ఆధ్యాత్మిక సేవా ప్రస్థానానికి ఘన నివాళి.
హోంబలే ఫిల్మ్స్, ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏఐ మోషన్ క్యాప్చర్, కంప్యూటర్ విజన్ టెక్నాలజీలను ఉపయోగించి మనుషుల కదలికలను డిజిటల్ యానిమేషన్‌గా మార్చే ఈ సాంకేతికత వల్ల పాత్రలకు మరింత సహజత్వం, భావోద్వేగాలు చేకూరనున్నాయి. డైవ్ డీప్ ఏఐ స్టూడియోతో కలిసి ట్రాన్స్‌సెండెంటల్ ఫిల్మ్స్ నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తుండగా, హోంబలే ఫిల్మ్స్ సమర్పణతో పాటు ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూషన్ చేయనుంది.
1965లో తన 69వ ఏట భారతదేశం నుంచి అమెరికాకు ప్రయాణం ప్రారంభించిన శ్రీల ప్రభుపాదులు, భగవద్గీతలోని శాశ్వత బోధనలు, శ్రీకృష్ణుడి సందేశాన్ని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో ఆ ప్రయాణం చేశారు. తన గురువు శ్రీల భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాకూర్ ఆదేశాన్ని అనుసరిస్తూ ప్రారంభించిన ఈ ప్రస్థానం లక్షలాది మందికి కృష్ణ చైతన్య సందేశాన్ని చేరవేసే మహోద్యమంగా మారింది. అచంచల విశ్వాసం, సంపూర్ణ శరణాగతి, పట్టుదల, నిస్వార్థ సేవకు ఆయన జీవితం గొప్ప నిదర్శనం.
ఈ చిత్రానికి గౌర శక్తి దాస రచన, దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్ సింగ్, లోహిత్ రావు నిర్మాతలుగా ఉన్నారు. శ్రీధర్ శికారిపుర విజువల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ నరసింహ చైతన్య మఠం (శ్రీరంగపట్నం), ఇస్కాన్ బెంగళూరు, ఇస్కాన్, భక్తివేదాంత బుక్ ట్రస్ట్ (బిబిటి) ఆశీస్సులతో ఈ ప్రాజెక్ట్ రూపొందుతోంది. శ్రీల ప్రభుపాదుల వ్యాస పూజ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని 2027 ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.
ఆధ్యాత్మిక చరిత్రను ఆధునిక టెక్నాలజీతో కలిపి తెరపైకి తీసుకొస్తున్న ఈ చిత్రం తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.

