Taapsee Pannu: సినిమా ఎంత వసూలు చేసిందనే లెక్కల కంటే, తాను పోషించిన పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో ఎంతకాలం నిలిచాయన్నదే తనకు ప్రధానమని బాలీవుడ్ నటి తాప్సీ పన్ను స్పష్టం చేశారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం గాంధారి నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో, తన కెరీర్ ఎంపికలు మరియు బాక్సాఫీస్ ఫలితాలపై ఆమె ఆసక్తికర దృక్పథాన్ని పంచుకున్నారు.

రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాలు తన ఖాతాలో ఎక్కువగా లేనప్పటికీ, నటిగా తన ప్రయాణం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నట్లు తాప్సీ తెలిపారు.

తాత్కాలిక లాభాల కంటే శాశ్వత గుర్తింపు ముఖ్యం

సినిమాల జయాపజయాలు, కథల ఎంపికపై తాప్సీ మాట్లాడుతూ.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయినా, పదేళ్ల తర్వాత అవే చిత్రాలు కల్ట్ క్లాసిక్స్ గా నీరాజనాలు అందుకున్న సందర్భాలు సినీ చరిత్రలో ఎన్నో ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. తాత్కాలిక కలెక్షన్ల వెంట పడటం కంటే తన ఫిల్మోగ్రఫీ బలంగా ఉండేలా చూసుకోవడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. కాలానుగుణంగా పరిస్థితులు మారినా, ఒక నటిగా తాను చేసిన చిత్రాల జాబితా చరిత్రలో శాశ్వతంగా ఉండిపోతుందని అభిప్రాయపడ్డారు. కొన్నేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, తాను సరైన కథలనే ఎంచుకున్నాననే గర్వం, ఆత్మసంతృప్తి తనలో కలగాలన్నదే తన ఏకైక లక్ష్యమని తాప్సీ వెల్లడించారు. వాణిజ్య విజయాల రొటీన్ ఫార్ములాను పక్కనపెట్టి, వైవిధ్యమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న తాప్సీ, తాజా చిత్రం గాంధారితో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Next Story